మమ్మల్ని తిట్టినోళ్లు బఫూన్లు, సన్నాసులు.. టైం వచ్చినపుడు భరతం పడ్తం

మమ్మల్ని తిట్టినోళ్లు బఫూన్లు, సన్నాసులు.. టైం వచ్చినపుడు భరతం పడ్తం
  • పిచ్చి చానల్, పిచ్చి పేపర్ అంటూ మీడియాపై కేటీఆర్ రుసరుస
  • అందరి చిట్టా మా దగ్గరుంది..
  • అవసరం వచ్చినప్పుడు భరతం పడ్తమని హెచ్చరిక
  • మా మౌనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు
  • గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటది.. టైం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తద
  • కేసీఆర్ తో పెట్టుకున్నోళ్లు ఒక్కడు కూడా బాగు పడలె
  • బీజేపీ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్

సీఎంలనే ఉరికిచ్చినం

ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మాకున్నది. మీలాంటి బఫూన్లను ఉరికిచ్చుడు మాకు లెక్క కాదు. టైం వస్తది. ప్రతీది రాసిపెట్టుకుంటున్నం. మిత్తితో పాటు చెల్లిస్తం. ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు. పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ కు ఎవరి సపోర్టు లేదు. మీడియా, మనీ, మజిల్ పవర్ లేదు.  సీఎం కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. - కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలపై టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బఫూన్లు, సన్నాసులు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారని ఆయన విమర్శించారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, అవసరం వచ్చినప్పుడు భరతం పడ్తామని,  మిత్తితో పాటు చెల్లిస్తామని, అందరి చిట్టా తమ వద్ద ఉందని హెచ్చరించారు. టీఆర్ఎస్పై బీజేపీ లీడర్లు చేస్తున్న విమర్శలను ఓ పిచ్చి చానల్ చూపిస్తోందని, ఓ పిచ్చి పేపర్ రాస్తోందంటూ మీడియాపై రుసరుసలాడారు. శనివారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు  సీఎం పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

‘‘మా నాయకుడు  కేసీఆర్ సైలెంట్గా ఉన్నరని, మా విద్యార్థి నాయకులు సైలెంట్గా ఉన్నరని ఎవడు పడితే వాడు.. ఎటు పడితే అటు మాట్లాడుతున్నరు. వాళ్లందరికీ ఒకటి చెప్తున్నా.. యాదిపెట్టుకోండ్రి. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగా ఉంటది. సమయం వచ్చినప్పుడు తుపాకీ విలువ ఏంటో తెలుస్తది’’ అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం స్టూడెంట్ లీడర్లు కష్టపడి పనిచేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే 50 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు.

మీడియాపై మండిపాటు

బీజేపీ లీడర్లు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని, మీడియా కోసమే హంగామా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘‘ఎగిరెగిరి మాట్లాడుతున్నరు. కేసీఆర్ ను ఎంత పడితే అంత తిడుతున్నరు. ఓ పైశాచిక ఆనందంతో పిచ్చి చానల్ చూపిస్తోందని, పిచ్చి పేపర్ రాస్తోందని, దాని కోసమే మాట్లాడుతున్నరు. కింద నలుగురైదుగురు సీటీలు వేస్తుండ్రు. జమ చేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి మాటలు మాట్లాడుతున్నరు’’ అని ఆయన ఆరోపించారు.

రేవంత్ కు పట్టిన గతే బీజేపీ లీడర్లకు పడ్తది

ఎంపీ రేవంత్ రెడ్డి పేరును కేటీఆర్ పరోక్షంగా ప్రస్తావించారు. ఆయనకు పట్టిన గతే బీజేపీ లీడర్లకు పడుతదని హెచ్చరించారు. ‘‘ఇట్లనే మాట్లాడి  ఒకాయన ఖతమైపోయిండు. ఇదివరకు ఒకడుండే. గింతంతే ఉండెటోడు. వాడు అట్లే ఖతమైండు.  గదే ఓటుకు నోటు. వాడు ఒర్లి, ఒర్లి బందైండు. ఇప్పుడు వీళ్లు ఇద్దరు మోపయిండ్రు. ఎగురుతుండ్రు. చూస్కోండ్రి.. కేసీఆర్ తో పెట్టుకున్నోళ్లు ఒక్కడు కూడా బాగు పడలె. పెద్ద పెద్దోళ్లే ఖతమైండ్రు. ఈ మొరిగే కుక్కలు కూడా  జాగ్రత్తగా ఉండాలి. మీ లెక్కలు  మా దగ్గర ఉన్నయ్’’ అని  కేటీఆర్
హెచ్చరించారు.

కేంద్రం ఏం ఇవ్వట్లేదు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయట్లేదని కేటీఆర్  ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం మరిచిపోయిందన్నారు. ఒక్క సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని  ప్రశ్నించారు. బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నోళ్లని, తప్పుడు ప్రచారాలు తప్ప నిజాలు చెప్పరని ఆయన దుయ్యబట్టారు. ‘‘మోడీ చాలా హామీలు ఇచ్చిండు. వాటి లెక్కలు మీరు అడగండి. పకోడీలు అమ్ముకుంటే కూడా అది బీజేపీ ఘనత ఎలా అవుతుంది’’ అని ప్రశ్నించారు. మోడీ మాటలు కోట్లలో ఉంటాయని, చేతలు పకోడీల్లా ఉంటాయని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ను బీజేపీ నేతలు తిడితే ఊరుకోబోమని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్  అన్నారు. కష్టపడి పనిచేసిన వారందరికి పదవులు వస్తాయని ఎమ్మెల్యే గాదరి కిషోర్ చెప్పారు.

కేంద్రం ఒక్క విద్యాసంస్థనూ ఇయ్యలేదు

తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకు?: కేటీఆర్‌‌ ట్వీట్‌‌

రాష్ట్రానికి గడిచిన ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌‌  శనివారం ట్వీట్ చేశారు.  ఆరేండ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చింది బిగ్‌‌ జీరో అని పేర్కొన్నారు. కేంద్రం దేశంలో కొత్తగా ఏడు ఐఐటీలు, ఏడు ఐఐఎంలు, రెండు ఐఐఎస్‌‌ఈఆర్‌‌లు, 16 ట్రిపుల్‌‌ ఐటీలు, నాలుగు నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ డిజైన్‌‌లు, 157 మెడికల్‌‌ కాలేజీలు, 84 నవోదయ విద్యాసంస్థలు మంజూరు చేస్తే, వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదని తెలిపారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన ట్రైబల్‌‌ యూనివర్సిటీని కూడా స్థాపించలేదని, తెలంగాణపై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకని ఆయన  ప్రశ్నించారు.