సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా యంత్రాంగానికి సూచించారు. సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా సేవలుండాలని ఆయన అధికారులకు సూచించారు. సిరిసిల్ల అభివృద్ధిపై జిల్లా అధికారులతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్ధితులపైన, కరోనా‌ బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలను జిల్లా వైద్య శాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న కరోనా రోగులు ఎంతమంది, వారికి అందుతున్న సేవలు, వారికి కేటాయించిన ఐసోలేషన్ సౌకర్యాలు, వైద్య చికిత్స సౌకర్యాలపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

క్లస్టర్‌ ఆస్పత్రులపై మరింత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పీహెచ్‌సీల ఏర్పాటుపై వేగంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరాతీశారు. సిరిసిల్లలో అభివృద్ది పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని అధికారులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు