ప్రతిపక్షాలు తిడుతుంటే.. విప్‌‌లు ఏం చేస్తున్నరు?

ప్రతిపక్షాలు తిడుతుంటే.. విప్‌‌లు ఏం  చేస్తున్నరు?

హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వ విప్‌‌లు ఏం పని చేస్తున్నారని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్‌‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా విప్‌‌లు నోరు విప్పడం లేదని ఇంతమంది విప్‌‌లు ఉండి ఏం లాభమని ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్‌‌లో పలువురు విప్‌‌లతో కేటీఆర్​ మాట్లాడారు. ఆర్మూర్‌‌ ఎమ్మెల్యే జీవన్‌‌రెడ్డిని అభినందించారు. ప్రతిపక్షాల ఆరోపణలను జీవన్‌‌  సమర్థంగా తిప్పికొడుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పదవుల్లో ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకోవద్దని, వారు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే విధంగా తిరిగి సమాధానం ఇవ్వాలని అన్నట్లు తెలిసింది. 

టీఆర్​ఎస్​ మండల కార్యవర్గాల ఏర్పాటుపై చర్చ

టీఆర్​ఎస్​ మండల కార్యవర్గాల ఏర్పాటుపైనా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌‌ చర్చలు జరిపారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం రెండున్నర గంటల పాటు కేటీఆర్‌‌ పార్టీ కమిటీలపైనే చర్చించారు. ఇప్పటికీ కమిటీలు వేయలేకపోయిన మండలాలు, అందుకు కారణాలు, పార్టీ నేతల మధ్య విభేదాలు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ 
పదవులు, రాష్ట్ర కమిటీ పదవులపైనా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లు కేటీఆర్‌‌కు అందజేసినట్టు తెలిసింది.