
మైక్రోచిప్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సోమవారం (జులై 3వ తేదీన) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ లెక్కల ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు తెలిపారు. బెంగళూరు, చెన్నై నగరాల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు.
లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందన్నారు.
సెమీకండక్టర్ రంగంలో భారత్ తన వర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందన్నారు. వచ్చే దశాబ్ధంలో ఆ రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు. ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మందికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో కూడా తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు. భారత్‌లో అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్‌లోనే ఉందన్నారు.