
జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు నుంచి సరికొత్త పాలనలో భాగంగా జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. హైదరాబాద్ కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
వార్డు అధికారితోపాటు 10 మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు పరిష్కారం ఎంత సమయంలో చేయాలనే సిటిజన్ చార్టర్ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉన్నదని, అందులో హైదరాబాద్‌లోనే కోటి మందికిపైగా ఉన్నారన్నారు. నగరంలో జనసాంద్రత చాలా ఎక్కువని.. కోటి మందికి సేవలు అందించేందుకు క్షేత్రస్థాయికి పాలనను విస్తరించామని చెప్పారు. అధికారులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వార్డు పరిపాలన తీసుకొచ్చాని పేర్కొన్నారు.
గ్రామాలలో పంచాయతీ సెక్రెటరీతో పాటు ఇతర సిబ్బంది ఉంటారని.. చిన్న చిన్న మున్సిపాలిటీలలో వార్డుకొక ఆఫీసర్ ఉంటారని చెప్పారు. మరి కోటికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో 35వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. కాబట్టి అందుకోసమే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డుకు పది మంది సిబ్బంది ఉంటారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డుకు నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు.