ఆస్క్ కేటీఆర్ : వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో అంటే..?

ఆస్క్ కేటీఆర్ : వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో అంటే..?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సెషన్ లో పలు ఆసిక్తకర సమాధానాలు ఇచ్చారు కేటీఆర్.

మునుగోడు ఉపఎన్నికపై..

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటని ఓ నెటిజన్ అడగ్గా..ముందు ఎన్నిక ప్రకటన వెలువడనీ అని అన్నారు. తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని..దాంతో ఏం మారుతుందని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ లేదా కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు.. తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో పోరాడాలన్న ప్రశ్నకు..కేవలం జాతీయ పార్టీలతోనే ఎందుకు అనేక ఇతర పార్టీలు కూడా ఉన్నాయని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ తీరుపై ..

పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి పేదలకు సహాయం చేయడం మాని కార్పొరేట్ సంస్థలకు కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. మోడీ విపక్ష ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయిపైన దృష్టి సారించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో డీపీ మార్చడం వల్ల ఏమవుతుందని..జీడీపీ మారితే దేశానికి మంచి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రాల్లో పర్యటిస్తే, ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీ, ప్రస్తుత రాజకీయాలపై

బీజేపీ నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బిజెపి నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయడం, ద్వేషాన్ని పెంచడంలో సిద్ధహస్తులని అన్నారు. అయితే బీజేపీ అబద్ధాలను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. బండి సంజయ్ స్వయంగా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆ విషయం నువ్వే చెప్పాలంటూ చమత్కరించారు. వచ్చే ఏడాది వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. 

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై

ఐఐటీ సమస్యలపై అడిగిన ప్రశ్నకు.. విద్యార్థుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించిందని.. మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు వీసీ , డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు, పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటీ మంత్రి అవ్వాలన్న ట్వీట్ కు..తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతోనే సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇవే కాకుండా ఇంకా పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

హైదరాబాద్ లో సమస్యల గురించి..

హైదరాబాద్ నగరంలో మురికి నీటి నిర్వహణకు సంబంధించి SNDP కార్యక్రమం కొనసాగుతోందని..దాని పూర్తి ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపిన కేటీఆర్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం పైన హైకోర్టు స్టే ఇచ్చిందని  దాన్ని రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలోనే మెట్రో విస్తరణపై కూడా ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. ట్యాంక్ బండ్ పై కొంతకాలం కొనసాగిన సండే ఫన్  డే కార్యక్రమం త్వరలో తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలారు.