
కరీంనగర్ లోయర్ మానేరు వంతెన వద్ద మానేరు రివర్ ఫ్రంట్ పనులకు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అలాగే అర్బన్ భగీరథ పథకంలో భాగంగా చేపడుతున్న 24x7 వాటర్ సప్లై పనులను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన పైలాన్‌ను మంత్రులిద్దరూ కలిసి ఆవిష్కరించారు. సుమారు రూ.615 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇందులో మానేరు రివర్ ఫ్రంట్ పనులకే రూ.410 కోట్లు ఖర్చు చేస్తారు.
కేటీఆర్ పర్యటనతో ముందస్తు అరెస్టులు
సుదీర్ఘ కాలం తర్వాత మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు రావడంతో టీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కరీంనగర్ దారులన్నీ నింపేశారు. ఫ్యుచర్ ఆఫ్ తెలంగాణ పేరుతో కేటీఆర్ నిలువెత్తు హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు కేటీఆర్ పర్యటనలో ఎక్కడ ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలుపుతారో అని పోలీసులు మందస్తు అరెస్టులు చేశారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ తో పాటు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకొని.. స్టేషన్ కు తరలించారు. అయితే కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేయడంపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.