
తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పట్టణాల అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు వచ్చే బడ్జెట్లో ఐనా సరిపోయే అన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడమో లేదంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఐనా కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులతో ఇప్పటికైనా తమ ప్రభుత్వ పనితీరును మోడీ సర్కార్ గుర్తించిందన్న ఆశాభావంతో.. మరిన్ని నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో ఈ లేఖ రాస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 68 పురపాలికలను142కు పెంచుకున్న విషయాన్ని తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం -SRDP, వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు- SNDP, కాంప్రహెన్సీ రోడ్ మెయింటనెన్స్ ప్రాజెక్ట్- CRMP, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్- HRDCL, మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్- MRDCL, తెలంగాణ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -TUFIDC వంటి సంస్థల ఏర్పాటుతో పాటు... అనేక స్పెషల్ పర్పస్ వెహికల్లను ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా పూర్తి కావడం వల్లనే.. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో వరుసగా ఆరోసారి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ స్థానం దక్కించుకుందన్నారు.
ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపాలని కేటీఆర్ కోరారు. రూ.6,250 కోట్ల బడ్జెట్‌తో 31 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టుని నిర్మించ తలపెట్టామన్నారు. హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం దాదాపు 3050 కోట్లు ఖర్చు అవుతున్నాయని, ఇందులో 15% మూలధన పెట్టుబడిగా 450 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించాలన్నారు. నగరంలో మురుగు నీటిని శుద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా... రూ.4,961 కోట్ల అంచనా వ్యయంతో 1591 MLD సామర్థ్యంతో.. 41 ఎస్టిపిల నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.. రూ. 3,722 కోట్ల వ్యయంతో 2232 కిలోమీటర్ల మేర భారీ మురుగునీటి సరాఫరా నెట్ వర్క్ ను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు.. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరయ్యే రూ.8,684 కోట్ల వ్యయంలో కనీసం మూడో వంతును స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భరించి తెలంగాణకు మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.