
హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు కేంద్రం అండగా నిలవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఎంఎస్‌ఎంఈల లోన్ చెల్లింపులపై వచ్చే ఏడాది మార్చి నెలాఖరు దాకా మారిటోరియం విధించాలని, వడ్డీని ఎత్తేయాలని కోరారు. కరోనా తగ్గతుండటంతో దేశమంతటా ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలు కార్యక్రమాలు ప్రారంభించడానికి కేంద్రం సాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకు రాకపోవడం, కూలీలు సొంతూర్లకు వెళ్లిపోవడంతో ఆ సంస్థలు.. కస్టమర్లకు ఉత్పత్తులను అందించలేకపోతున్నాయని లేఖలో తెలిపారు.