కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన కేటీఆర్

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన కేటీఆర్

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు.ఆయ‌న‌తో భేటి అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి శాఖ,విమానయాన శాఖకు సంబంధించిన అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 2537.81 లక్షలను మంజూరు చేయాలని కోరామ‌న్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్ర మంత్రికి వివరించాన‌ని, దానిపై హర్దీప్ పూరి సానుకూలగా స్పందించారని చెప్పారు. ఆక్టోబర్ లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని కేంద్ర మంత్రి సూచించార‌ని చెప్పారు. స్వచ్ఛ భారత్ నిధులు,అమృత్ పథకం నిధులు,15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 784 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామ‌న్నారు. వాటితో పాటుగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.

వరంగల్ మమునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కోరగా.. అందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ త్వరలో కేంద్ర బృందం పంపుతామని తెలిపారన్నారు. త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ భేటిలో టీఆర్ఎస్ నాయ‌కుడు వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Minister KTR met Union Civil Aviation Minister Hardeep Singh Puri on Monday in Delhi