కడియం వర్సెస్ రాజయ్య.. 2 గంటలు మంత్రి కేటీఆర్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ..ఏం మాట్లాడారంటే..

కడియం వర్సెస్ రాజయ్య..  2 గంటలు మంత్రి కేటీఆర్తో ఎమ్మెల్యే రాజయ్య  భేటీ..ఏం మాట్లాడారంటే..

మంత్రి కేటీఆర్తో  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భేటీ ముగిసింది.  కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కు రాజయ్య వివరణ ఇచ్చారు. దాదాపు రెండు గంటలకు పైగా మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే రాజయ్య  సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కడియం శ్రీహరి తీరు, స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి వ్యవహార శైలితో పాటు..బీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్కు రాజయ్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తో్ంది. 

ఏం మాట్లాడారంటే..?

కడియం శ్రీహరి, తన మధ్య జరుగుతున్న వివాదంపై మంత్రి కేటీఆర్ పిలుపుతో ప్రగతిభవన్ కు వచ్చానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 21 రోజులు, 146 గ్రామాలు తిరుగుతూ పనిచేశానని చెప్పారు. అయితే మహారాష్ట్ర వెళ్లి వచ్చాక స్టేషన్ ఘన్ పూర్ లో తనపై అసత్య ప్రచారం జరిగిందని..అందుకే కడియం శ్రీహరిపై  విమర్శలు చేశానని ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. 

కడియం గ్రూపులు కడుతున్నడు..

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గ్రూపులు కడుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని..మళ్లీ ఇంకో పవర్ స్టేషన్ తయారు కావొద్దని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని రాజయ్య తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ మాట లెక్కచేయకుండా కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని..అక్కడ తానే బాస్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,  ఇతర నాయకులు అందరూ నిధుల కోసం తనకు ప్రపోజల్ పెడతారని..కానీ కడియం శ్రీహరి మాత్రం తాను పవర్ స్టేషన్ అన్నట్లు ..ప్రపోజల్ పెట్టరని చెప్పారు. 

అధిష్టానం నాకే అనుకూలం..

కడియం శ్రీహరితో వివాదం విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం తనకే అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. టికెట్ విషయంలోనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు క్లారిటీ ఉందన్నారు. అవన్ని అధిష్టానం చూసుకుంటుందని..నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ తనతో చెప్పారని స్పష్టం చేశారు. సర్పంచ్ నవ్య వివాదం విషయంలోనూ అధిష్టానానికి క్లారిటీ ఉందని..ఆమె ఆరోపణలన్ని  అవాస్తవమని తేలిపోయిందన్నారు. కడియం కులం విషయంలో గతంలో మోత్కుపల్లి నర్సింలు, మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలనే తాను గుర్తు చేశానన్నారు. 

మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

కడియం శ్రీహరితో వివాదం ముగిసిపోయిందని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరితో ఇబ్బంది కాకుండా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. కడియం శ్రీహరి వివాదంలో తాను చెప్పిన విషయాలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని..అధిష్టానం ఆశీస్సులు తనకు వంద శాతం ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.