
- కాళేశ్వరం.. చరిత్రలో నిలిచిపోతది
- కేసీఆర్ కట్టిండనే రంధ్రాన్వేషణ చేస్తున్నరు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు దీనిని గుర్తిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, గూగుల్‌లో కూడా టైప్ చేస్తే అదే వస్తుందని చెప్పారు. ‘‘చైనాలో త్రీగోర్జెస్ డ్యాం నిర్మిస్తే వహ్వా అన్నోళ్లమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మన సీఎం కేసీఆర్ నిర్మిస్తే మాత్రం రంధ్రాన్వేషణ చేసి అక్కడో ఇక్కడో చిన్న చిన్న లొసుగులు, పొరపాట్లు ఉంటే.. వాటిని బూతద్దంలో పెట్టి చూస్తున్నరు. ఈరోజు కాకపోయిన రేపు చరిత్ర రాసినప్పుడు మేధావులే తప్పకుండా ఇది గొప్ప ప్రాజెక్టు అని అక్నాలెడ్జ్ చేస్తరు. ఇట్లాంటివి చరిత్రలో చెరిపేస్తే పోయేవి కాదు. చరిత్ర రాసే రోజు రాయకతప్పదు” అని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన కాంపిటీటివ్ స్టడీ మెటీరియల్‌ను శనివారం వర్సిటీలో కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. రాబోయే శతాబ్దం పాటు కొన్ని జిల్లాల్లో సాగు, తాగు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన అన్నారు. 8ఏండ్లలో ప్రభుత్వరంగంలో 2.20 లక్షల ఉద్యోగాలిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు.
మునావర్ ఫారూఖీ షోను సాకుగా చూపి బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. తన పేరు మీద కొట్టుకొని చావాలని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. ‘‘ఎవరి అమ్మ గొప్ప, ఎవరి దేవుడు గొప్ప అనే ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. ఏ దేవుడు గొప్పవాడో తేల్చుకునే పోటీలో తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఉండబోరు. భారత్ విశ్వగురు అని గొప్పగా చెప్పుకుంటున్నా ఇప్పటికీ మనది పేద దేశమే. 1987లో ఇండియా, చైనా జీడీపీ ఒకే ప్రమాణంలో ఉండేది. ఈ రోజు చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్‌లకు చేరితే మనం ఇంకా కులాలు, మతాల గొడవలతో కొట్టుకుచస్తున్నం. దేశంలోని ప్రజలు ఏం తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఆలోచించాలని నిర్దేశిస్తున్న నియంతృత్వ ప్రభుత్వాలను విమర్శించొద్దా?” అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్ల లోనే ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించామని చె ప్పారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ చెడిపోయిందో, అభివృద్ధి చెందిందో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
విద్యా, వైద్య రంగాల్లో నంబర్ వన్ చేస్తం
తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు.. నిధులు.. నియామకాల అంతిమ లక్ష్యాన్ని సాధించామని కేటీఆర్ అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కొత్త జోనల్ సిస్టం తీసుకువచ్చామని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేటు రంగంలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదన్నారు. రానున్న రోజుల్లో విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను మారుస్తామన్నారు. ఎనిమిదేండ్లుగా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచుతున్నారన్నారు. అన్నం, వైద్యం లేక ఎవరైనా చనిపోతే అది ఆ ప్రభుత్వానికే సిగ్గుచేటని పేర్కొన్నారు. ఏనాడూ పేదల కష్టాలను చూడనోళ్లు ఉచితాలు మంచివి కావంటూ నీతి సూత్రాలు చెప్తున్నారని, కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసి, పేదలకు పెన్షన్లు ఇవ్వొద్దంటున్నారని మండిపడ్డారు. వర్థమాన రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, భారత రాజ్యాంగంపై అందరికీ అవగాహన కల్పించేలా స్టడీ మెటీరియల్ ఉండాలని సూచించారు. మెటీరియల్ హార్డ్ కాపీలతో పాటు సాఫ్ట్ కాపీలు అందుబాటులో ఉంచాలన్నారు. 2,700 పేజీల స్టడీ మెటీరియల్‌ను డిజిటలైజ్ చేసేందుకు సహాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు.