ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఎన్డీఏ పరిపాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గాలికి వదిలేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి బతుకు భారం చేసిందంటూ మండిపడ్డారు. తాజాగా పేదవాడి పొట్టకొట్టడానికి ఉచిత పథకాల మీద చర్చకు తెరతీశారని ఆరోపించారు. మోడీ కంటే ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పుచేస్తే..మోడీ ఒక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని చెప్పారు. ఇంత సొమ్మును అప్పుగా తెచ్చి.. ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారా..? లేక జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా..? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా..? అని ప్రశ్నించారు. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి వద్దకు చేరాయో మోడీ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

లక్షల కోట్ల అప్పులు తెస్తారు గానీ, వాటితో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయరంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలుపెడితే, వాటి మీద విషం చిమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతుందని, ఈ మధ్యే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసిందన్నారు. FRBM చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కానీ మోడీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని, ఇదే విషయంపై కాగ్ గుర్తు చేసిందని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించిందని గుర్తు చేశారు. 

మోడీ హయాంలో పేదల సంక్షేమం గాలికి..
ప్రధాని మోడీ అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలు, పెరుగు లాంటి  నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు కేంద్రం అమలు చేస్తుందని ఆరోపించారు.  దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆకలి సూచిలో దిగజారిన భారత్..
ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించామని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో 116 దేశాల్లో 101వ స్థానానికి భారత్ చేరుకుందని చెప్పారు. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో ఉంటున్నారని, వారిలో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని చేప్పారు. 

రైతు సంక్షేమం అనే మాటకు మోడీకి అర్థం తెలియదు..!
దశాబ్దాలుగా ప్రకృతి ప్రకోపానికి గురై, గిట్టుబాటు ధరల్లేక, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఇవ్వొద్దని చెబుతున్నారా..? అని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులను 13 నెలల పాటు రోడ్ల మీదకు తీసుకొచ్చి, అరిగోస పెట్టి 700 పైచిలుకు రైతుల బలవన్మరణానికి కారణమైన మోడీకి రైతు సంక్షేమం అనే మాటకు కూడా అర్థం తెలియదన్నారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతో పాటు దేశ రైతులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలు  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆరోపించారు.  రసాయనిక ఎరువులపై సబ్సిడీలకు భారీగా కోత విధించడంతో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.  అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు.. ఇది పెనుభారం అవుతుంది అన్న సంగతి బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ఎప్పటికి అర్థం అవుతుంది మోడీ గారూ అంటూ ప్రశ్నించారు. 

మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం..

  •  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బడుగులకు ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం మీదనేనా మీ అక్కసు మోడీ గారూ ? 
  • బడుగు, బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లలో ఉచితంగా భోజనం పెట్టడం మీదనేనా మీ కండ్ల మంట మోడీ గారూ ?
  •  గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చి వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడం మీరు నిషేధిస్తారా ఇక? 
  • గర్భిణీలకు ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారా పోషకాహారం అందించడం, అమ్మఒడి 102 వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రసూతి తరువాత పుట్టిన బిడ్డ సంరక్షణ  కోసం కేసీఆర్ కిట్ ఇవ్వడం, 13,000 నగదు సహాయం చేయడం మీ దృష్టిలో వృధా ఖర్చా మోడీ గారూ? 
  • తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, ఉన్న నీళ్లు ఫ్లోరైడ్ విషంతో బొక్కలు అరగదీసిన గడ్డ మీద మిషన్ భగీరథ పథకం పెట్టి ఉచితంగా మంచి నీరు ఇవ్వడం మీకు రుచించడం లేదా మోడీ గారూ? 
  •  నేతన్న చేతిలో చిల్లిగవ్వ  లేక నేసిన దారాలే ఉరిపోగులుగా మారుతున్న సంక్షోభ సమయంలో వారిని ఆదుకోవడానికి నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరల వంటి పథకాలు పెట్టడం కూడా తప్పు అనడం ఏం న్యాయం మోడీ గారూ? 
  • కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ వంటి పథకాలు తెచ్చి పేదవారింట సంతోషం వెల్లివిరిసేలా చేయడం ఇకపై కొనసాగవద్దు అంటున్నారా మోడీ గారూ? 
  •  దళితబంధు పథకం అవసరం లేదంటున్నారా మోడిగారూ?
  •  వంట గ్యాస్ సిలిండర్ కూడా రీఫిల్ చేయించుకోలేని ప్రజల సంఖ్య 4.13 కోట్లు. కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే కొనగలిగిన వారి సంఖ్య 7.67 కోట్లు. నిజాలు ఇలా ఉంటే గ్యాస్ సబ్సిడీని ఎత్తేయాలనే మీ దుర్మార్గమైన ఆలోచన ఎంతమంది పేదలను ఆకలిమంటల్లోకి పడదోస్తున్నదో ఎన్నడైనా ఆలోచించారా మీరు?
  • కోవిడ్ మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు భీతావహులై పొట్టచేతబట్టుకుని, ఆకలితో అలమటిస్తూ పిల్లా పాపలతో కలిసి స్వస్థలాలకు కాలి నడకన పయనిస్తుంటే, వారి వద్ద కూడా ముక్కుపిండి రైలు టికెట్ చార్జీలు వసూలు చేసిన పాషాణ హృదయపు ప్రభుత్వం మీది. 
  • సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని ప్రకటించడానికి మీ ప్రభుత్వానికి మనసెలా వచ్చింది మోడీ గారూ?
  •  కోట్లాది మంది వయో వృద్ధులకు మ‌న స‌హాయ‌, స‌హ‌కారాలు అవ‌స‌రం. వారిని మనం గౌర‌వించుకోవాలి.  మీ మిత్రులైన బడా పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల పన్ను రాయితీలు ఇస్తున్న మీ ప్రభుత్వం దగ్గర దేశంలోని సీనియర్‌ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు కేటాయించడానికి చేతులు రావట్లేదా మోడీజీ?
  • పేద రైతన్నకు రుణమాఫీ చేస్తే ఉచితాలు తప్పు అని ఘోషించే మీరు మరి అదే సమయంలో ఈ దేశపు కార్పొరేట్ పెద్దలకు మాత్రం అందినకాడికి దోచిపెడుతున్నారు. గత మూడేళ్లలోనే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చింది ఘనత వహించిన మీ ప్రభుత్వం. బడా బాబులకు 10 లక్షల కోట్లకు పైగా బ్యాంకు అప్పులు సైలెంటుగా రైట్ ఆఫ్ చేసిన మీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల అప్పుల విషయానికి వచ్చేసరికి మీ స్వరం మారిపోతుంది.

ప్రజా సంక్షేమం మీద మీ విధానం ఏమిటో ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయండని మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ళ పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన..ఎగ్గొట్టిన రుణాలు ఎన్ని? రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని? - మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా చెప్పండి.- పేదలకు, రైతులకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద మీ బీజేపీ పార్టీ వైఖరి స్పష్టపరచండని ప్రశ్నించారు. -వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా దేశప్రజలకు చెప్పండన్నారు. దేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ  ఎర్ర కోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేశాక జాతినుద్దేశించి  చేసే ప్రసంగంలో పేదల సంక్షేమం కొరకు చేపట్టిన పథకాల మీద మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.