అందరికీ సర్కార్ జాబ్​లు ఇవ్వలేం..ప్రైవేట్ కంపెనీలతోనే ఉద్యోగాలొస్తయ్

అందరికీ సర్కార్ జాబ్​లు ఇవ్వలేం..ప్రైవేట్ కంపెనీలతోనే ఉద్యోగాలొస్తయ్
  • కాంగ్రెస్ లీడర్లు పిచ్చోళ్లు.. పీసీసీ పదవి రేవంత్​కి ఇచ్చిన్రు
  • మహబూబ్​నగర్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి విమర్శలు
  • మన జనాభా నాలుగు కోట్లు.. కొలువులేమో ఆరున్నర లక్షలు
  • కాంగ్రెస్ లీడర్లు పిచ్చోళ్లు.. పీసీసీ పదవి రేవంత్​కు ఇచ్చిన్రు
  • మహబూనగర్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి విమర్శ

జడ్చర్ల టౌన్/హన్వాడ/భూత్పూర్/అడ్డాకుల, వెలుగు : ‘‘రాష్ట్ర జనాభా 4 కోట్లు. అందులో సర్కారు కొలువులు ఆరున్నర లక్షలు. అందరికీ గవర్నమెంట్ జాబ్ లు ఇచ్చే పరిస్థితి ఉండదు.  ప్రైవేట్ కంపెనీలు వస్తే ఉద్యోగ కల్పన పెరుగుతుంది”అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో చెక్​డ్యామ్​ల ద్వారా ఇప్పటికే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, కర్వెన రిజర్వాయర్ ద్వారా మరో 60ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్లు ఎన్ని కేసులు పెట్టి అడ్డంకులు సృష్టించినా, పీఆర్ఎల్ఐ పనులు వేగంగా పూర్తి చేసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ నింపి, మరో రెండు నెలల్లో ఉదండాపూర్ రిజర్వాయర్​ను కూడా నింపుతామని తెలిపారు. రెండు రిజర్వాయర్ల ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. జడ్చర్లను గ్రేడ్-1 మున్సిపాలిటీగా మార్చటమే గాక, అభివృద్ధి కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనే పోడు రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వివరించారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు.

కాంగ్రెస్ లీడర్లు పిచ్చోళ్లు

‘‘కాంగ్రెస్ లీడర్లు పిచ్చోళ్లు. రేవంత్ రెడ్డి చేతిలో టీపీసీసీ పదవి పెట్టిన్రు. అతను ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ” అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్​కు అధికారం అప్పగిస్తే రూ.2 వేల పింఛన్​ పోయి.. రూ.200 వస్తాయన్నారు. కాంగ్రెస్​ను నమ్మితే శంకరగిరి మాన్యాలు పడతారని ఎద్దేవా చేశారు.50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ప్రజా సమస్యలు పట్టించుకొని ఉంటే.. ఈనాడు పాదయాత్రలు చేయాల్సిన ఖర్మ పట్టేది కాదన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు ఉండేవి కాదన్నారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలను తెలంగాణ ఏర్పడ్డాక  కేసీఆర్ పరిష్కరించారన్నారు...

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మహబూబ్​నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ముందుగా భూత్పూర్ మున్సిపాల్టీకి చేరుకుని పార్క్, ఓపెన్ జిమ్​ను ప్రారంభించారు. అక్కడి నుంచి మూసాపేట మండలం వేముల వద్ద ఎస్​జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండో యూనిట్​కు భూమి పూజ చేశారు. తర్వాత జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న గర్ల్స్ ఐటీఐ కాలేజ్​లో సెయింట్ ఫౌండేషన్, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్రూం​​ ఇండ్లను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నే శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.