మున్సిపల్‌‌లో ‘శానిటేషన్‌‌ ప్లాన్‌‌’: కేటీఆర్

మున్సిపల్‌‌లో ‘శానిటేషన్‌‌ ప్లాన్‌‌’: కేటీఆర్

పారిశుధ్య కార్మికులు, వెహికల్స్‌‌ పెంచాలి: మంత్రి కేటీఆర్
అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్‌ యార్డులు
కార్పొరేషన్లలో ఇంకొన్ని షీ టాయిలెట్లు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన పారిశుధ్యం కోసం సిటీ శానిటేషన్‌‌ ప్లాన్‌‌ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌‌ తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్‌‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు.  పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికతో మంచి ఫలితాలొచ్చాయని, ఇదే స్కీంను టౌన్స్‌‌లో అమలు చేస్తామన్నారు. వారం రోజుల్లో మున్సిపాలిటీల వారీగా శానిటేషన్‌‌ ప్లాన్‌‌ సిద్ధం చేసి సీడీఎంఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరించడం నుంచి రీసైక్లింగ్​ వరకు అన్ని వివరాలను ప్రణాళికలో ఉంచాలన్నారు.  స్వచ్ఛ సర్వేక్షన్‌‌ మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులు, చెత్త సేకరించే వాహనాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కార్మికులందరికీ యూనిఫాంలు, రక్షణ సామగ్రి అందజేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ, ఇన్సూరెన్స్‌‌ సౌకర్యాలు కల్పించాలని, ఆయా కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించాలన్నారు.

అన్ని ఓడీఎఫ్‌‌ సాధించాలి

మున్సిపాలిటీల్లో డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేయాలని, స్థలం లేకుంటే సేకరించాలన్నారు. డ్రైరీ సోర్స్‌‌ కలెక్షన్‌‌ సెంటర్‌‌ (డీఆర్సీసీ) ఏర్పాటు చేయాలన్నారు. పాత మూన్సిపాలిటీలన్నీ ఓడీఎఫ్‌‌ సాధించాయని, కొత్త మున్సిపాలిటీలు ఓడీఎఫ్‌‌ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేషన్లలో మరిన్ని షీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, పట్టణాల్లోని పబ్లిక్‌‌ టాయిలెట్స్‌‌ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. వరంగల్‌‌ కార్పొరేషన్‌‌తోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీలో మానవ వ్యర్థాల ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్లు ఉన్నాయని, అలాంటి ‌‌ప్లాంట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీల బడ్జెట్‌‌లో పది శాతం గ్రీన్‌‌ యాక్షన్‌‌ ప్లాన్‌‌కు కేటాయించాలన్నారు.