
- ఏ పార్టీతో సంబంధం లేకుండా సత్యాగ్రహం చేశారు
- బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లతో మంత్రి కేటీఆర్
- క్యాంపస్ క్యాంటిన్లో ఫుడ్ క్వాలిటీ మెరుగుపడాలి
- ఇన్నోవేషన్ టీ హబ్, ఇన్ఫర్మేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తం
- ముగ్గురు మంత్రులతో కలిసి ట్రిపుల్ ఐటీకి వెళ్లిన కేటీఆర్
- ఆందోళనలు జరిగిన మూడు నెలలకు పర్యటన
భైంసా, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఉద్యమం తనకు నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా విద్యార్థులంతా స్వచ్ఛందంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహం తరహాలో ఉద్యమించారని ఆయన అభినందించారు. ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల కోసం ఆందోళన చేసే స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
‘‘నేను చాలా రోజుల పాటు హాస్టల్లోనే ఉండి చదువుకున్న. హాస్టల్ సమస్యలన్నీ నాకు తెలుసు. విద్యార్థులు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దశలవారీగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తం” అని ఆయన అన్నారు. సోమవారం ఆయన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. హెలికాప్టర్లో వచ్చిన మంత్రులకు స్థానిక నేతలు, ఆఫీసర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రిపుల్ఐటీ విద్యార్థులతో లంచ్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. క్యాంటిన్లో ఫుడ్ క్వాలిటీ మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫుడ్ సహా వర్సిటీలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ నవంబర్‌లో తాను బాసర ట్రిపుల్ఐటీకి వచ్చి స్టూడెంట్లందరికీ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగాలు చేయాలనే ఆలోచన మాని, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఎదగాలని అన్నారు. ఇందులో భాగంగానే కొత్త ఆవిష్కరణల కోసం యూనివర్సిటీలో ఇన్నోవేషన్ టీహబ్‌ను ఏర్పాటు చేస్తామని, క్యాంపస్‌లో వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల కోరిక మేరకు అదనంగా 50 మోడ్రన్ క్లాస్‌రూమ్స్ నిర్మాణం చేపడుతామన్నారు. రూ. 3 కోట్లతో మినీ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. క్యాంపస్‌లో ప్రస్తుత కోర్సులతో పాటు మారుతున్న సైన్స్అండ్ టెక్నాలజీ రంగాలకు తగ్గట్టుగా నెక్స్ట్ జనరేషన్‌కు ఉపయోగపడే లా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
యూనివర్సిటీలో పరిశుభ్రతకు ప్రతి విద్యార్థి నడుం బిగించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నెలకోసారి స్టూడెంట్లందరూ శ్రమదానం చేసి తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ బాధ్యతను స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) తీసుకోవాలని ఆయన సూచించారు. ఇన్స్టాగ్రాం, వాట్సప్ లాంటి సోషల్ మీడియాను ఓ గంట సేపు పక్కన పెట్టి విద్యార్థులంతా శ్రమదానంలో పాల్గొనాలని అన్నారు. ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్ బ్రహ్మ పదార్థాలు కావని, ఇలాంటి ఆవిష్కరణలు మనం కూడా చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుండే కొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా చింతకింది మల్లేశంతో పాటు సిరిసిల్ల విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేషన్ పరికరాల గురించి మంత్రి వివరించారు. ప్రతి ఆరు నెలలకోసారి తాను బాసర ట్రిపుల్‌ఐటీని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి సందర్శిస్తానన్నారు.
ఆందోళనలు జరిగిన మూడు నెలలకు...
తమ డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన మూడు నెలల తర్వాత మంత్రి కేటీఆర్ క్యాంపస్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లలో క్యాంపస్‌ను కేటీఆర్ సందర్శించాలన్నది కూడా ఒకటి. అయితే అప్పట్లో విద్యార్థుల ఆందోళనపైన గానీ, వారి డిమాండ్లపైన గానీ కేటీఆర్ స్పందించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో క్యాంపస్‌లో స్టూడెంట్ల ఐక్యతను దెబ్బతీసేందుకు పోలీసులు, అధికారులు రకరకాల ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు గుమిగూడడం, ఫోన్ల వాడకం , ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంపై ఆంక్షలు విధించారు. తీరా ఆందోళనలు సద్దుమణిగిన మూడు నెలల తర్వాత ముగ్గురు మంత్రులతో కలిసి ట్రిపుల్‌ఐటీని కేటీఆర్ సందర్శించారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.