నాగోల్ లో ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

నాగోల్ లో ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

హైదరాబద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరులాగే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ట్రాఫిక్ జాం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఎస్ఆర్ డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతామని వివరించారు. ఇప్పటి వరకూ 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 16 ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ లో దాదాపు రూ.143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ హాజరయ్యారు. 

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవని, ఇప్పుడు ఫ్లై ఓవర్ ప్రారంభం వల్ల తగ్గిపోయాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. రానున్న నాలుగైదు నెలల్లో మరిన్ని ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలో రూ.600 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. భారత్ లోనే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు ఉండేలా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంతో ప్రపంచంలోనే చాలా నగరాలను వెనక్కి నెట్టి ‘వరల్డ్ గ్రీన్ సిటీ’గా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్ లో మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న రిజిస్ట్రేషన్లు, పట్టాల సమస్య పరిష్కారాలకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో జీవో ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం.. ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ చేద్దాం’ అని చెప్పారు. 

ట్రాఫిక్ సమస్య తీరినట్లే..
ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 990 మీటర్ల పొడవుతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ ను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ (SRDP)లో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మాణం చేపట్టింది. 990 మీటర్ల పొడవుతో, 6 లైన్ల ఫ్లైఓవర్ ను SRDPలో భాగంగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాయి. 23 పిల్లర్లు, 22 స్పాన్స్ తో నిర్మించిన ఈ వంతెనకు రెండు మార్గాలు 24 మీటర్ల వెడల్పు, 6 లేన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. డిసెంబర్ మొదటివారంలో కొత్తగూడ, శిల్పా లేఅవుట్ లలో మరో రెండు ఫ్లై ఓవర్లు ప్రారంభించనున్నారు.