కేసీఆర్​ను విమర్శిస్తే ఊకోవద్దు

కేసీఆర్​ను విమర్శిస్తే ఊకోవద్దు

 

  • టీఆర్ఎస్ నాయకులతో మంత్రి కేటీఆర్
  • కేసీఆర్ పేదలకు ఇల్లు ఇస్తుండు.. పెండ్లి చేస్తుండు
  • ఏ సీఎం కష్టపడనంతగా కష్టపడుతున్నరు
  • ఎర్రటి ఎండలోనూ కాళేశ్వరం నీళ్లు పారిస్తున్నరు
  • కేంద్రం రూపాయి తీసుకుని ఆఠాన ఇస్తున్నది
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో కేటీఆర్ పర్యటన


రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ మీద ఎవరేం మాట్లాడినా ఊరుకోవద్దని, దీటుగా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఇష్టమున్నట్లు మాట్లాడితే గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకులు బదులివ్వాలన్నారు. ‘అభివృద్ధి అక్కడ జరుగుతాంది.. మన దగ్గర ఎందుకు జరుగుత లేదు’ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారి అబద్ధపు ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. ‘‘ప్రజలను ఎగేసేటోళ్లు చాలా మంది పని లేక ఫేస్ బుక్, వాట్సాప్ లో ఉన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను దూషించడం తప్ప వారికి వేరే పనేమీ లేదు. వారు ఒకటి గుర్తుంచుకోవాలి. అభివృద్ధి అనేది ఒకేసారి జరగదు. అంచెలంచెలుగా జరుగుతుంది’’ అని సూచించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో కేటీఆర్ పర్యటించారు. హరిదాస్ నగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్, క్రిమటోరియంను ప్రారంభించారు. మోహినికుంటలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, మద్దికుంట, చీకోడు, ముస్తాబాద్, ఆవునూర్​లో రైతు వేదికలను ప్రారంభించారు. మోహినికుంటలో సింగిల్ విండో డీజిల్ బంక్​ను ఓపెన్ చేశారు. జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అందుకున్న మోహినికుంట, హరిదాస్ నగర్ గ్రామ పాలకవర్గాలను సత్కరించారు. ‘‘పల్లెల్లో అబివృద్ధి కోసం దేశంలో ఏ సీఎం కష్టపడనంతగా మన సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు. ఎర్రటి ఎండలో కూడా కాళేశ్వరం నీళ్లను ఎగువ మానేరులో నింపి, ప్రతి గ్రామానికి సాగు నీరందిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదు’’ అని అన్నారు. 

గత ప్రభుత్వాలు డబ్బా ఇండ్లు కట్టించినయ్

‘‘మాది పేదల సంక్షేమ సర్కార్. ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అంటారు.. కానీ మన సీఎం కేసీఆర్.. ఇల్లు కట్టిచ్చి..పెళ్లి కూడా చేస్తానంటున్నరు. పేదవాడికి ఇంతకంటే ఏం కావాలి” అని కేటీఆర్ అన్నారు. ‘‘రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,876 ఇండ్లు మొదలుపెట్టాం. అందులో 3,100 ఇళ్లు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి” అని అన్నారు. గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో డబ్బా ఇండ్లు కట్టించాయని, పేద ప్రజలను 3 చెరువుల నీళ్లు తాగించాయన్నారు.

2,600 రైతు వేదికలను నిర్మించినం

రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 2,600 రైతు వేదికలను నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతు వేదికలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి, నేరుగా సైంటిస్టులతో సలహాలు, సూచనలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుత బడ్జెట్​లో రైతుల కోసం రూ.5,250 కోట్లను రుణమాఫీ కోసం కేటాయించామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల350 కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు.