ఐటీఐఆర్ ఇస్తే ఆకాశమే హద్దుగా హైదరాబాద్ అభివృద్ధి చెందేది

ఐటీఐఆర్ ఇస్తే ఆకాశమే హద్దుగా హైదరాబాద్ అభివృద్ధి చెందేది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశామని పార్లమెంట్ లో ప్రకటించిన కేంద్రం.. దానికి సమానమైన ప్రాజెక్టులు కేటాయించామని అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘ఐటీఐఆర్ కు సమాన స్థాయిలో ప్రాజెక్టులు ఇవ్వాలని 50 సార్లు కేంద్రాన్ని కోరాం. అయినా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టమ్ కు నయా పైసా సాయం చేయలేదు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ ఇచ్చి ఉంటే ఆకాశమే హద్దుగా హైదరాబాద్ అభివృద్ధి చెందేదని అన్నారు.అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. 

రాజకీయంగా విభేదిస్తున్నామనే... 

రాజకీయంగా విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో ఐటీఐఆర్ ను కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ కారిడార్లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్ రద్దు చేశామని కేంద్రం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ కు ప్రతిపాదన చేసి, 2013లో ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ దాన్ని రద్దు చేసి, తెలంగాణకు తీరని అన్యాయం చేసింది” అని అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్ వేర్ పార్కులు మంజూరు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపిందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళకు సాఫ్ట్ వేర్ పార్క్ లు కేటాయించి.. తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఐటీ పార్క్ ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని, తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలను యువత గమనిస్తోందన్నారు. 

కేంద్రం తీరుతోనే బొగ్గు కొరత 

కేంద్రానికి దూరదృష్టి లేకపోవడంతోనే దేశంలో బొగ్గు కొరత తలెత్తిందని కేటీఆర్ విమర్శించారు. ‘‘కేంద్రం తీరుతో దేశంలో లభ్యమయ్యే ధర కన్నా 10 రేట్లు అదనంగా చెల్లించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశంలో వందేండ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా.. కేంద్రం దివాళాకోరు విధానాలతోనే సమస్య ఏర్పడింది” అని ఆయన ట్వీట్ చేశారు.

బెల్లంపల్లి కమిషనర్ ను సస్పెండ్ చేయండి

బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన కేటీఆర్ బర్త్ డే వేడుకలకు నలుగురు సిబ్బంది హాజరుకాకపోవడంతో వాళ్లకు గంగాధర్ మెమో జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మెమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేటీఆర్ స్పందించారు.