దేశానికి కేసీఆర్ లాంటి టార్చి బేరర్ కావాలె

దేశానికి కేసీఆర్ లాంటి టార్చి బేరర్ కావాలె
  • బుల్డోజర్, బిల్డప్‌‌, గోల్‌‌మాల్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ కావాలే: కేటీఆర్
  • మోడీ రైతు విరోధి.. ఆయనది తలాతోక లేని ఫారిన్‌‌ పాలసీ
  • టీఆర్‌‌ఎస్‌‌ ప్లీనరీలో ఫైర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో డబుల్‌‌ ఇంజిన్‌‌ సర్కార్లు వద్దని, గ్రోత్‌‌ ఇంజిన్‌‌ సర్కార్లు కావాలని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. భారత్‌‌కు గోల్‌‌మాల్‌‌ మోడల్‌‌, బుల్డోజర్‌‌ మోడల్‌‌, బిల్డప్‌‌ మోడల్‌‌ కాదని, తెలంగాణ మోడల్ పరిచయం కావాలన్నారు. వసుదైక కుటుంబం లెక్క, అందమైన పూలబొకేలా ఉన్న భారత్‌‌ను కాపాడాలంటే సీఎం కేసీఆర్‌‌ లాంటి టార్చ్‌‌ బేరర్‌‌ కావాలని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌లో జరిగిన టీఆర్​ఎస్​ ప్లీనరీలో దేశ ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలనే తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మేరా భారత్‌‌ మహాన్‌‌ అనే నినాదాన్ని సాకారం చేసే నాయకుడ్ని భారత దేశం కోరుకుంటోందని, ఆ నాయకుడిని తెలంగాణనే అందిస్తదని తెలిపారు. దేశం కోరుకుంటున్నది ఉద్వేగాల భారతం కాదని, ఉద్యోగాల భారతమని చెప్పారు.

డబుల్‌‌ ఇంజిన్‌‌ పాలన అంటే ధరలు డబుల్‌‌

‘‘డబుల్‌‌ ఇంజిన్‌‌ పాలన అంటే ధరలు డబుల్‌‌.. మత పిచ్చి, అరాచకాలు డబుల్‌‌. ప్రధాని మోడీ మనసులో దేశ భక్తి లేదు.. విద్వేష భక్తి మాత్రమే ఉంది. జాతీయవాదం అంటూ జాతీయ సంస్థలైన హెచ్‌‌పీసీఎల్‌‌, ఎల్‌‌ఐసీ, వైజాగ్‌‌ స్టీల్‌‌ను అమ్ముతున్నరు. తెలంగాణలో ఏడేండ్లలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. 35 ఏండ్ల క్రితం చైనా, ఇండియా జీఎస్‌‌జీడీపీ సేమ్‌‌ అని, కానీ చైనా అభివృద్ధి చెందినా భారత్‌‌ అక్కడే ఉంది’’ అని చెప్పారు.

మోడీకి సాగుపై అవగాహన లేదు 

గోల్‌‌మాల్‌‌ గుజరాత్‌‌ మోడల్‌‌ పై 2011నుంచి 2014 దాకా ఊదరగొట్టి దేశ ప్రజలను ఆగమాగం చేసి ఏలుతున్నరని మంత్రి కేటీఆర్‌‌ మండిపడ్డారు. 2022 రైతుల ఆదాయన్ని డబుల్‌‌ చేస్తామన్నరు. కానీ నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి అరిగోస పెట్టారన్నారు. మోడీ రైతు విరోధి అని రైతులు అంటున్నారని చెప్పారు. మోడీకి వ్యవసాయం అంటే కనీస అవగాహ లేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనం తెస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నరు, సిలిండర్‌‌ ధరలు, పెట్రో రేట్లు పెంచుతున్నారని విమర్శించారు.

తలాతోక లేని ఫారిన్‌‌ పాలసీ

మోడీ గంగా ప్రక్షాళన అని.. కరోనా టైంలో గంగానదిలో శవాలు తేలేంత అసమర్థ పాలన చేస్తున్నారని విమర్శించారు. తలాతోక లేని ఫారిన్‌‌ పాలసీతో ప్రపంచ దేశాల్లో ఇండియాను నవ్వులపాలు చేస్తున్నరని విమర్శించారు. ఎలక్షన్‌‌ ఉంటే పాకిస్తాన్‌‌ ను తిడుతరని, లేకుంటే నవాజ్‌‌ షరీఫ్‌‌ను కలిసి విందు ఆరగిస్తరని ఎద్దేవా చేశారు. బీజేపీ చేతిలో అధికారం దేశానికి అంధకారం, ప్రమాదకరమని విమర్శించారు. ‘‘సబ్‌‌కా సాత్‌‌ సబ్‌‌కా వికాస్‌‌ అంటరు. కానీ మోడీ ప్రభుత్వంలో వికాస్‌‌ అనేది ఒక వింత పదం అయిపోయింది. విద్వేషం నాలుగు పాదాల మీద నడుస్తోంది’’ అని అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు ఎదుగుతున్న దేశంగా ఉండాలి. ఇంకా థర్డ్‌‌ వరల్డ్‌‌ కంట్రీగా ఉండాలే. ఇంకా ఎన్ని దశాబ్దాలు కులపిచ్చి, మత పిచ్చి సంస్థలు రెచ్చగొట్టే ఉద్వేగానికి లోనవుదాం. నా పేరు చెప్పి కొట్టుకచావండని ఏ దేవుడు చెప్పారు’’ అని ఫైర్‌‌ అయ్యారు.

చరిత్రలో నిలిచిపోయేది ఎన్టీఆర్‌‌, కేసీఆరే

తెలుగు చరిత్రలో నిలిచిపోయేది ఎన్టీఆర్‌‌, కేసీఆర్‌‌ మాత్రమేనని, కేసీఆర్‌‌ హిస్టరీతోపాటు జాగ్రఫీ కూడా క్రియేట్‌‌ చేశారన్నారు. ఇయ్యాల తెలంగాణ ఆచరిస్తున్నదని, రేపు దేశమంతా ఆచరిస్తుందనడానికి అతిశయోక్తి కాదన్నారు. రైతుబంధు, మిషన్‌‌ భగీరథ, టీఎస్‌‌ ఐపాస్‌‌ పథకాలను కేంద్ర కాపీ కొట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో 24గంటల పాటు కరెంట్‌‌ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయ దిగుబడి, ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం 130శాతం పెరిగిందని తెలిపారు.

సోదరభావమే తెలంగాణ మోడల్

‘‘దేశానికి దార్శనికుడు, విజనరీ కావాలి. టెలివిజనరీలు కాదు. ప్రజల బతుకు బాగు చేసే విజన్‌‌ కావాలి. మతం పేరిట, కులం పేరిట చిచ్చు పెట్టే విజన్ కాదు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చినట్టుగానే దేశంలో ప్రజలను మార్చే నాయకత్వం కావాలి. మత పిచ్చి.. కులపిచ్చి లేని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకు పోతోంది. సోదరభావాన్ని కోరుతూ దాన్నే మోడల్‌‌గా చేసుకుని ముందుకు వెళ్తున్నదే తెలంగాణ మోడల్‌‌’’ అని కేటీఆర్‌‌ అన్నారు.