రైతుబంధు 5 ఎకరాలకే లిమిట్ పై ఆలోచిస్తాం : కేటీఆర్

రైతుబంధు 5 ఎకరాలకే లిమిట్ పై ఆలోచిస్తాం  : కేటీఆర్

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే  రైతుబంధు లిమిట్ పై  ఆలోచిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు 4 లేదా 5 ఎకరాలకే పరిమితం చేయడంపై పరిశీలిస్తామని చెప్పారు.  రాష్ట్రంలో ఎక్కువ భూమి ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారని.. దీంతో వారికే రైతుబంధు డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయన్నారు కేటీఆర్..బడా రైతులకు ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయని కొందరిక ఏడుపు ఉందని.. మీకొచ్చిన దానిపై ఎందుకు సంతృప్తి చెందరని ప్రశ్నించారు. ఎవరికి ఎంతుంటే  అంత వస్తుందని..దానికి ఏడుపెందుకననారు.

అవమానాలతోనే రాష్ట్ర ప్రయాణం మొదలైందని.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్నో అపోహాలు, అనుమానాలు రాష్ట్రంపై ఉండేవని.. కానీ ఈరోజు వాటిన్నింటికీ,  అభివృద్ధే సమాధానం చెబుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపారవేత్తలు..  ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటూ ముందుకు రారని చెప్పారు.  టిఎస్ఐ పాస్ తో పారిశ్రామికవేత్తలకు మంచి జరిగిందన్నారు. అధికారం అనేది ఎప్పటికీ, ఎవ్వరికీ శాశ్వతం కాదని.. రేపు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే ఎవరైనా  తప్పుకోవాల్సిందేనన్నారు.

గతంలో కొన్ని ప్రాంతాలలో  14 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేది కానీ.. ఇప్పుడు రోజు తప్పి రోజు వస్తున్నాయని చెప్పారు. రానున్న రోజులో 24 గంటలు స్వచ్ఛమైన నీళ్లు వచ్చేలా కృషి చేసే బాధ్యత తనదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఎన్నో ఇండస్ట్రీస్ హైదరాబాద్ కి వస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం రాష్ట్రం నాణ్యత అని, రాష్ట్రం బాగుంటేనే పారిశ్రామిక  వాడలు బాగుంటాయని అన్నారు.