ప్రభుత్వం చేసేవి అప్పులు కాదు.. భవిష్యత్‌‌ పెట్టుబడులు: కేటీఆర్‌‌‌‌

ప్రభుత్వం చేసేవి అప్పులు కాదు.. భవిష్యత్‌‌ పెట్టుబడులు: కేటీఆర్‌‌‌‌
  • పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లిస్తే, మనకు తిరిగిచ్చింది 1.68 లక్షల కోట్లే
  •     నేను చెప్పింది అబద్ధం అయితే పదవికి రాజీనామా చేస్తా
  •     రామస్వామి గుట్టలో 60 కోట్లతో సింగిల్​ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తాం
  •     హుజూర్‌‌‌‌నగర్ సభలో మంత్రి 

సూర్యాపేట/నల్గొండ, వెలుగు: అప్పులతో రాష్ట్ర సంపదను పెంచుతున్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని కొందరు విమర్శిస్తున్నారని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం చేసేవి అప్పులు కావని, భవిష్యత్‌‌ పెట్టుబడులని పేర్కొన్నారు. ఈ అప్పులను పెట్టుబడులుగా పెట్టి, రాష్ట్రంలో సంపదను పెంచుతున్నామని చెప్పారు. ఒకవైపు రాష్ట్ర సంపాదనను పెంచుతుంటే ప్రధాని మోడీ ప్రభుత్వానికి కండ్ల మంట ఎందుకో అర్థం కావట్లేదని విమర్శించారు. 8 ఏండల్లో తెలంగాణ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.68 లక్షల కోట్లు కడితే, కేంద్రం మాత్రం రాష్ట్రానికి కేవలం రూ.1.68 లక్షల కోట్లు తిరిగిచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ నిజం అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసే దమ్ము కిషన్ రెడ్డికి లేదన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డితో కలిసి నియోజకవర్గంలో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ‌‌‌‌ఎస్‌‌‌‌ఐ డిస్పెన్సరీ, ఎస్‌‌‌‌టీ‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌లను ప్రారంభించి, తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 

మత రాజకీయాలు చేస్తున్నరు..

దేశంలో ఉన్న మరో రెండు జాతీయ పార్టీలు ఝూటా మాటలు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు. నలుగురు సన్నాసి ఎంపీలు, ఓ కేంద్ర మంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై బూతులు మాట్లాడుతూ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ కంటే ముందున్న ప్రధాన మంత్రులందరూ కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఒక్క మోడీ ఎనిమిదిన్నరేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు అయితే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.79 లక్షలుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టిందని, సంపన్నులైన మోడీ దోస్తులను బాగుచేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. అవార్డులు ఉత్తగనే రావని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పారు. 

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ డీఎన్‌‌‌‌ఏ మారలే.. 

టీఆర్ఎస్ పార్టీ పేరు మారిందే తప్ప.. అదే జెండా, అదే గుర్తు, అదే డీఎన్ఏ ఉన్నాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే సైదిరెడ్డి గెలవడం ఖాయం అని జోస్యం చెప్పారు. మూడేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇక్కడ ఇచ్చిన ప్రతి హామీని రూ.3 వేల కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో సాగు నీటి కోసమే రూ.2 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్‌‌‌‌, అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రూ.35 కోట్లతో తండాలకు, గ్రామాలకు రోడ్లు వేశామన్నారు. రామస్వామిగుట్ట ఏరియాలో కాంగ్రెస్ మొదలుపెట్టిన 2,100 సింగిల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని రూ.60 కోట్లతో పూర్తి చేస్తామని, ఈ పనులకు తాజాగా శంకుస్థాపన చేశామని తెలిపారు. 66 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రైతుబంధు డబ్బు వేసిన ఘనత తమదేనని వెల్లడించారు. సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు లిఫ్టులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.35 కోట్లు మంజూరు చేస్తామని, జాన్ పహాడ్ దర్గాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మేళ్లచెరువు శివాలయం జాతరకు హాజరవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, భాస్కర రావు, అధికారులు పాల్గొన్నారు. 

చండూరు రూపురేఖలు మారుస్తాం..

మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు చండూరు పట్టణ రూపురేఖలు మారుస్తామని కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలోని గట్టుప్పుల్, చండూరులో రూ.40 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశామని, ఈ పనులను నాలుగైదు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నల్గొండలో ఫ్లోరోసిస్‌‌‌‌ రక్కసిని తరిమేసిందని గుర్తుచేశారు. శివన్నగూడెం, లక్ష్మాపురం రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. 

సత్య నాదెళ్లతో కేటీఆర్‌‌‌‌ భేటీ

ఇండియా పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌‌‌‌ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్‌‌‌‌ భేటీ అయ్యారు. ఆయనను కలిసిన ఫొటోను కేటీఆర్‌‌‌‌ శుక్రవారం ట్విట్టర్​లో షేర్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలుసుకున్నామని, బిజినెస్‌‌‌‌, బిర్యానీ గురించి చర్చించుకున్నామని పేర్కొన్నారు. సత్య నాదెళ్ల రెండ్రోజుల కింద ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉద యం ఆయన హైదరాబాద్‌‌‌‌కు చేరుకోగా కేటీఆర్‌‌‌‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఏపీని కట్టబెట్టాలనుకుంటున్నరు: మంత్రి జగదీశ్​రెడ్డి 

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమకూ దక్కాలంటే దేశవ్యాప్తంగా బీఆర్‌‌‌‌ఎస్ అధికారంలోకి రావాలని పలు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారని మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీని కూడా కేసీ‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌కు కట్టబెడితే తమ రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్రా ప్రజలు అనుకుంటున్నట్లు చెప్పారు. టీఆర్‌‌‌‌ఎస్ పార్టీ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మారగానే ఫస్ట్‌‌‌‌ పార్టీలో చేరడానికి వచ్చింది ఏపీకి చెందిన నేతలేనన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు దయ్యంలా మారారని, కేసీఆర్ అభివృద్ధి పనులను చూసి ఈర్ష్య పడుతున్నారని విమర్శించారు. ఎమెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సీఎం కేసీ‌‌‌‌ఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. నియోజకవర్గం ప్రజలే తన పిల్లలు అని అంటున్న ఉత్తమ్ ఏ రోజు కూడా ప్రజల మధ్యలో తిరగలేదని ఆరోపించారు.