ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్...  కాళేశ్వరం

ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్...  కాళేశ్వరం

జగిత్యాల: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఆ నినాదాన్ని నిజం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... పోరాడి రాష్ట్రంలో  నీళ్ల విషయంలో ఏ రాష్ట్రం చేయని అద్భుత పని కేసీఆర్ చేశారని, రూ. 40 వేల కోట్ల రూపాయల ఖర్చుతో   కోటి ఇళ్లకు నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టైన కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడించారు. ఇక  ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు.   టాలెంట్ ఉంటే ప్రపంచమే ఎర్ర తివాచీ పరుస్తుందని, నిరుద్యోగ యువత గట్టిగా చదివి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఇక తెలంగాణలో వచ్చిన నిధులను రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ధాత్రి, భువి కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఆహ్వానిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.