కరోనా క్రైసిస్‌కు కేంద్ర నిర్ణయాలే కారణం

కరోనా క్రైసిస్‌కు కేంద్ర నిర్ణయాలే కారణం

హైదరాబాద్: కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు పలు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు 150 ఐసీయూ బెడ్స్‌‌ను రూ.15 కోట్లు పెట్టి డోనేట్ చేశాయన్నారు. ఆ బెడ్స్‌‌ను రోగుల సౌకర్యార్థం టిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ టిమ్స్‌ను సందర్శించారు. ప్రజలకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ అందరం కలసి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. 

రెండో వేవ్ తగ్గుతోంది

‘క్రమంగా కరోనా రెండో వేవ్ తగ్గుతోంది. ఈ లాక్‌‌డౌన్ అయ్యేసరికి కరోనా తగ్గుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేయిస్తున్నాం. ఈ ఏడాది కాలంలో టిమ్స్ ఎన్నో సేవలు అందించింది. సుమారు రూ.80 కోట్లు ఖర్చు పెట్టి ఐటీ కంపెనీలు సేవా కార్యక్రమాలు చేశాయి. సీఎస్‌‌ఆర్ కింద మరెన్నో మంచి పనులు చేస్తున్నాయి. వైద్య సిబ్బంది కూడా ఎంతో శ్రమిస్తున్నార’ని కేటీఆర్ ప్రశంసించారు. ప్రభుత్వం తరపున వారికి హృదయ ధన్యవాదాలు తెలిపారు.

వ్యాక్సిన్‌లను కేంద్రమే కొనుగోలు చేయాలె

‘కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల టీకా ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఆస్ట్రాజెనెకాకు చెందిన 50 కోట్ల డోసులు నిరుపయోగంగా ఉన్నాయి. కొనుగోలు చేయాల్సిన టైం లో కొనుగోలు చేయలేదు. దేశ జనాభాకు 264 కోట్ల డోసులు కావాలి. కానీ వ్యాక్సిన్స్ లేవు. కేంద్ర అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. కానీ రాష్ట్రం మాత్రం ముందు రిస్క్ గ్రూప్స్ వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. పక్క రాష్ట్రాలతో పోల్చితే మెరుగ్గా ఉన్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హై రిస్క్ గ్రూప్‌‌నకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. జీడీపీ తగ్గింది. రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రమే చెప్పింది. వాటిని ఖర్చు చేసి ప్రపంచంలో వ్యాక్సిన్ ఎక్కడ ఉన్నా తీసుకురావాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.