ఇండస్ట్రీలకు బెస్ట్‌ తెలంగాణ

ఇండస్ట్రీలకు బెస్ట్‌ తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియాలో మరే ఇతర రాష్ట్రంలో లేనంత ఈజీగా తెలంగాణలో ఇండస్ట్రీలకు కేవలం 15 రోజుల్లో పర్మిషన్లు ఇస్తున్నామని మున్సిపల్‌‌, ఇండస్ట్రీస్‌‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. ఇందుకోసం  టీ–ఐపాస్‌‌ విధానం తెచ్చామని, ఇండస్ట్రీ మొదలుపెట్టాలనుకునేవాళ్లు ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్‌‌ ఇస్తే సరిపోతుందని అన్నారు. 15 రోజుల్లో అప్లికేషన్‌‌పై నిర్ణయం తీసుకోకుంటే, అనుమతులు మంజూరైనట్టుగానే భావించుకోవచ్చని అన్నారు.  క్వాంట్రా క్వార్జ్‌‌ బ్రాండ్‌‌ పేరుతో  పోకర్ణ ఇంజనీర్డ్‌‌ స్టోన్‌‌ హైదరాబాద్‌‌ సమీపంలో నిర్మించిన కొత్త ప్లాంటును శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘గడువులోపు ఇండస్ట్రీలకు పర్మిషన్లు ఇవ్వని ఆఫీసర్లపై ఫైన్లు కూడా వేస్తాం. గత ఆరేళ్లలో రూ.2.20 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్లను తీసుకురాగలిగాం. 15 వేల మందికి జాబ్స్‌‌ వచ్చాయి. పోకర్ణ  ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద క్వార్జ్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ ఫెసిలిటీని నిర్మించడం వల్ల లోకల్స్​కు మేలు జరుగతుంది. ఇండస్ట్రీలను ఆకర్షించడమే కాదు, వాటిలో లోకల్‌‌ యూత్‌‌ జాబ్స్‌‌ పొందేలా చేయడానికి వారికి స్కిల్స్‌‌ ట్రెయినింగ్‌‌ ఇస్తాం. నగరాలతోపాటు పల్లెలూ డెవెలప్‌‌కావాలి. ఇందుకోసం సంబంధిత శాఖలన్నీ కలిసి పనిచేయాలి’’ అని కేటీఆర్​ అన్నారు.

 రూ.500 కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్‌‌

 ఈ కొత్త ఫెసిలిటీ కోసం పోకర్ణ రూ.500 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేసింది.  మేకగూడ వద్ద నిర్మించిన దీని కెపాసిటీ  ఏడాదికి  90 లక్షల చదరపు అడుగులు. ఇక్కడ 500 మంది పనిచేస్తున్నారు.  పరోక్షంగా మరో మూడు వేల మందికి పని దొరుకుతుంది.  ‘‘ఇటలీకి చెందిన పేటెంటెడ్‌‌ బ్రెటన్‌‌స్టోన్‌‌ టెక్నాలజీని వాడటం వల్ల క్వాలిటీ మార్బుల్స్‌‌ తయారు చేయవచ్చు. కొత్త ఫెసిలిటీతో  కంపెనీ  మొత్తం కెపాసిటీ 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుంది. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ ఫెసిలిటీని నుంచి రూ.400 కోట్ల టర్నోవర్‌‌ వస్తుందని భావిస్తున్నాం”అని సీఎండీ జైన్​ అన్నారు.