
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘మున్సిపల్ శాఖలో సమూల మార్పులు రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉండేవి, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలు 142 ఏర్పడ్డాయి. ఇప్పటివరకు రూ. 2959 కోట్లు మున్సిపాలిటీలకు విడుదల చేశాం. మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టాలన్న సీఎం సూచనలనుగుణంగా.. పట్టణాల్లో మిషన్ భగీరథ తీసుకొచ్చాం. పట్టణాల అభివృద్ధి కోసం గ్రీన్ బడ్జెట్ను రూపొందిస్తున్నాం. పౌరుడు కేంద్రంగా.. పౌర సేవలే లక్ష్యంగా మేం చట్టాలు తీసుకొస్తున్నాం. తాజాగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి అందిన వివరాల ప్రకారం.. జాతీయస్థాయిలో నిర్వహించిన శానిటేషన్ ఛాలెంజ్ లో 4300 నగరాలు పాల్గొంటే.. తెలంగాణలోని వివిధ పట్టణాలకు 12కు పైగా అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులన్నీ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 20న మన రాష్ట్రానికి అందనున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం ఏర్పాటుచేసిన సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో రాష్ట్రానికి కూడా అవార్డు లభించింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కూడా గతంలోనే అవార్డులు వచ్చాయి. రూ. 18 వేల కోట్లతో ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదు. హైదరాబాద్ లో ఒక ఇంటి నిర్మాణం కోసం దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు అవుతోంది. ఈ మొత్తం చూసుకుంటే.. ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు.. పది ఇందిరమ్మ ఇండ్లకు సమానం. కాబట్టి క్వాంటిటీని కాకుండా.. క్వాలిటీని చూడాలి.
గతంలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలకోసారి జీతాలు వచ్చేవి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా జీతాలు అందుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడో ఒకటి జరిగితే.. అన్నీ అక్రమ నిర్మాణాలు అని చెబుతున్నారు. చెడు కంటే మంచి మీద కూడా దృష్టిపెడితే బాగుంటుంది’ అని కేటీఆర్ అన్నారు.