హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక.. అసలు సమస్యే కాదు

హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక.. అసలు సమస్యే కాదు

హైదరాబాద్: హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక.. అది అసలు సమస్యే కాదు అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జలవిహార్‎లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారు కాబట్టే.. మనల్ని కడుపునిండా దీవించినరు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా గులాబీ జెండాకే జై కొడుతున్నరు. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్‎కే పట్టం కడుతున్నారు. విపక్షాల నేతలంతా.. పత్రికల్లో పతాక శీర్షీకల కోసం, జనాల్లో ప్రచారం కోసం, నోటి దూల తీర్చుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే వీళ్లను జనాలెవరూ సీరియస్‎గా తీసుకోవడంలేదు. రాబోయే రెండున్నరేండ్ల వరకు మనముందు ఏ ఎన్నిక లేదు. ఈ హుజురాబాద్ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక. అది అసలు సమస్యే కాదు. అది అక్కడున్న మనవాళ్లే చూసుకుంటరు. మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం విపక్షాల చిల్లర మాటలను తిప్పికొట్టాలి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.