కేసీఆర్​ను ఏమన్నా అంటే అటాకే

కేసీఆర్​ను ఏమన్నా అంటే అటాకే
  • రాష్ట్రం కట్టింది రూ. 3.65 లక్షల కోట్లు.. కేంద్రం ఇచ్చింది రూ. 1.68 లక్షల కోట్లే 
  • ఈ లెక్కలు తప్పయితే నా మంత్రి పదవి ఎడమకాలి చెప్పులెక్క పడేస్త

 

  • కిషన్​రెడ్డికి సిగ్గు లేదు.. రేవంత్‍ చిల్లర దొంగ
    వరంగల్‍/హనుమకొండ/నర్సంపేట, వెలుగు: ‘‘తెలంగాణ తెచ్చిన నాయకుడు.. తెలంగాణ తెచ్చిన పార్టీ అన్న ఒక్క కారణం చాలు.. జనం జీవితాంతం టీఆర్‍ఎస్‍ పార్టీకి ఓటెయ్యడానికి. రాష్ట్రంలో ఇయ్యాల తెలంగాణకు చెందిన పార్టీ టీఆర్‍ఎస్‍ ఒక్కటే. చాలా ఊళ్లల్లో ఈరోజుకు కూడా మన పార్టీని టీఆర్‍ఎస్‍ అని పిలువరు. తెలంగాణ పార్టీ అనే పిలుస్తరు. ఎందుకంటే తెలంగాణ అనే పదానికే పర్యాయపదం టీఆర్‍ఎస్‍” అని మంత్రి కేటీఆర్​ అన్నారు. బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍తో కలిసి వరంగల్‍ జిల్లా నర్సంపేట, హన్మకొండలో కేటీఆర్ పర్యటించారు. రూ.188.83 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఆరు గంటలకు హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్‍లో వరంగల్‍, హన్మకొండ టీఆర్‍ఎస్‍ అధ్యక్షులు ఎమ్మెల్యే అరూరి రమేశ్‍, చీఫ్‍విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర మంత్రిగా చెబుతున్నా. సాధికారికంగా చెబుతున్నా. తప్పయితే నా మంత్రి పదవితీసి ఎడమ కాలి చెప్పులెక్క పడేస్తా. ఈ ఏడున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి కట్టింది అక్షరాలా రూ.3,65,797 కోట్లు. మనకచ్చింది వెనక్కు రూ.1,68,647 కోట్లు. మనయే రూ.2 లక్షల కోట్లు వాళ్లకు పోయినయ్‍’’ అని అన్నారు .    
    కేసీఆర్‍తోనే రాష్ట్ర అభివృద్ధి 
    ఇంద్రుడు చంద్రుడు అని భావించే చంద్రబాబు నాయుడును, నూరేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‍ను ఎదుర్కొని.. కేసీఆర్‍ తెలంగాణ రాష్ట్రం తెచ్చాడని కేటీఆర్​ అన్నారు. 14 ఏండ్ల పాటు ఎన్నో అవమానాలకు గురిచేసినా, బంపర్‍ ఆఫర్లు ఇచ్చినా లెక్కచేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‍కు దక్కుతుందన్నారు. 67 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్‍ ఆరేండ్ల పాలనలో జరిగిందన్నారు.  
    మొరుగుతున్న కుక్కలు, గాడిదలు 
    బీజేపీ, కాంగ్రెస్‍ జాతీయ, రాష్ట్ర నేతలపైనా మంత్రి కేటీఆర్‍ తిట్ల పురాణం అందుకున్నారు. బేకార్, బఫూన్‍ నాయకులంటూ ఫైర్‍ అయ్యారు. ‘‘కేసీఆర్‍ లేకుంటే ఈ రోజు మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు గుర్తింపు ఎక్కడిది? టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? ఎవడీ రేవంత్‍రెడ్డి.. ఎవడీ సంజయ్‍.? ఒక్కొక్కడు గింతుంటడు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలకు ప్రధాని మోడీని కిటికీలోంచి చూడటం తప్పించి కలిసి మాట్లాడే దమ్ములేదన్నారు. ‘‘ఒకడు కరీంనగర్‍కు మెడికల్‍ కాలేజీ తీసుకురాకుండా పాలమూర్‍లో ఏదో పీకుతా అంటున్నాడు. నిజామాబాద్‍లో ఇంకోడు పసుపు బోర్డు తెస్తా అని బాండ్‍ పేపర్‍ రాసి మాట మార్చిండు. మూడోడు ఆదిలాబాద్‍లో సిమెంట్‍ కార్పొరేషన్‍ ఇండస్ట్రీ తెస్తానన్నడు. సికింద్రాబాద్‍ నుంచి గెలిచిన నాలుగో ఎంపీ, మంత్రి కిషన్‍రెడ్డికి సిగ్గు లేదు” అని అన్నారు. లక్షల రూపాయలు పట్టుకుని ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయిన ఓ చిల్లర దొంగ కాంగ్రెస్​కు రాష్ట్రంలో అధినేతగా ఉన్నారన్నారు.   
    అన్నీ ఇప్పుడే చేస్తే ఎట్లా? 
    జిల్లాల పర్యటనలో ఎమ్మెల్యేలు డెవలప్‍మెంట్‍ పేరుతో కోట్లాది రూపాయల ఫండ్స్ అడుగుతున్నారని.. ఇకనుంచి అది ఆపి చేసిన పనులు చెప్పుకోవాలని సూచించారు. అన్నీ ఇప్పుడే చేస్తే రాబోయే రెండు టర్మ్ లలో ఇంకా ఏం చేస్తామని ఫండ్స్ అడిగిన ఎమ్మెల్యేలను కేటీఆర్‍ ప్రశ్నించారు. గతంలో ఒక మున్సిపాలిటీకి రూ.కోటి ఇస్తే.. తాము రూ. 50 కోట్ల వరకు ఇచ్చామన్నారు.