కోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్లుగా మారిన్రు - కేటీఆర్

కోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్లుగా మారిన్రు - కేటీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: మోడీ, బోడీకి తాము బెదిరేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘మోడీ.. బోడి నీ ఈడీ మా వెంట్రుక్కూడా పీకలేదు..” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీకి ఫోజులు కొట్టడం తప్ప ఇంకేమీ రాదని, మన స్కీంలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందని ఆరోపించారు. కేంద్రం మన పథకాలకు అవార్డులు ఇస్తుంటే.. ఇక్కడికి వస్తున్న కేంద్ర మంత్రులు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారని మండిపడ్డారు. 

గుజరాత్‌‌ మోడల్‌‌ బేకార్‌‌ మోడల్‌‌ అని.. చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తున్న తీరు మోడీకి రుచించడం లేదన్నారు. తెలంగాణ భవన్‌‌లో మంగళవారం నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘కేంద్రంపై గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు.. ఏం చేసుకుంటవో చేసుకోపో.. చావనైనా చస్తంగానీ నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు.. తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు.. మోడీ మీదనే ఆరోపణలు వస్తున్నయ్‌‌.. మోడీ ఒత్తిడితోనే విద్యుత్‌‌ కాంట్రాక్టు అదానీకి ఇచ్చామని శ్రీలంక విద్యుత్‌‌ రంగ సంస్థల ఉన్నతాధికారి ఆరోపణలు చేశారు.. రూ.6 వేల కోట్ల కాంట్రాక్టు అదానీకి ఇవ్వాలని మోడీ ఒత్తిడి చేశారని సదరు అధికారి బాహాటంగానే చెప్పారు.. నీకు సిగ్గు, మానం, నీతి ఉంటే ముందు ఆ ఆరోపణల మీద వివరణ ఇవ్వు.. దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వు..’’ అని కేటీఆర్ డిమాండ్‌‌ చేశారు.

గుజరాత్‌‌కు నిధులు..తెలంగాణకు అరగుండ్లు

కొత్త రాష్ట్రం కాబట్టే కేంద్రం విషయంలో ఏడేండ్లు మౌనంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. గుజరాత్‌‌కు బోర్డులు, నిధులు ఇస్తూ తెలంగాణకు గుండ్లు, అరగుండ్లు ఇస్తున్నారని, అందుకే నిలదీస్తూనే ఉంటామన్నారు. ‘‘తెలంగాణలో ఒకప్పుడు రాజకీయంగా చంద్రబాబు, వైఎస్‌‌ లాంటి ప్రత్యర్థులుండేవారు.. వారిని మాట అనాలన్నా.. వారి నుంచి పడాలన్నా ఒక పద్ధతి ఉండేది.. ఇప్పుడున్న ప్రత్యర్థులు వట్టి బఫూన్లు.. బండి సంజయ్‌‌ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నడు? లవంగాలు, తంబాకు బుక్కుకుంటా ఎక్కడ తిరుగుతున్నడో? క్షుద్ర విద్యల గురించి సంజయ్‌‌ అంటే మాట్లాడిండు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు ఏమైంది.. ఆమె ఎందుకు అలా మాట్లాడారు’’ అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్లుగా మారారని, మునుగోడులో కాంగ్రెస్‌‌, బీజేపీ ఒక్కటయ్యాయనడానికి వెంకట్‌‌ రెడ్డి ఫారిన్ వెళ్తున్న తీరే నిదర్శనమన్నారు.

గులాబీ జెండాను దేశమంతటా నాటుతం

తెలంగాణ అభివృద్ధిని దేశమంతటా చాటి చెబుతామని కేటీఆర్ అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ పార్టీని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తామని, గులాబీ జెండాను దేశమంతటా నాటుతామని చెప్పారు. ‘‘గుజరాతోడు వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు గానీ కేసీఆర్‌‌ దేశ రాజకీయాల్లోకి వెళ్లొద్దా..? తెలంగాణ మోడల్‌‌ను, తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తంగా బరాబర్‌‌ పరిచయం చేస్తాం తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్‌‌ రాష్ట్ర సమితిగా ఎందుకు మారొద్దు.. తెలంగాణలో చేసినట్టే ఇతర ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరిస్తాం.. గుజరాత్‌‌ గోల్‌‌మాల్‌‌ మోడల్‌‌ దేశానికి పనికొచ్చినప్పుడు అభివృద్ధి, సంక్షేమం మిళితమైన తెలంగాణ మోడల్‌‌ దేశంలో ఎందుకు పనిచేయదు. బీఆర్‌‌ఎస్‌‌ వచ్చినంత మాత్రాన టీఆర్‌‌ఎస్‌‌ జెండా, ఎజెండా మారవు’’ అని ఆయన అన్నారు. 

మునుగోడు ప్రచారానికి 30 టీంలు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్‌‌ఎస్వీ నాయకులతో కూడిన 30 బృందాలు వెళ్తున్నాయి. ఒక్కో బృందంలో 15 నుంచి 20 మంది సభ్యులు ఉండేలా ప్లాన్‌‌ చేసుకుంటున్నారు. ఆయా టీంలకు టీఆర్‌‌ఎస్వీ రాష్ట్ర నాయకులు నేతృత్వం వహించనున్నారు. నియోజకవర్గంలోని 7 మండలాలు, 2మున్సిపాలిటీల్లోని గడప గడపకు వెళ్లి టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి తరపున వాళ్లు ప్రచారం చేయనున్నారు.

4 వేల మంది కార్యకర్తలను ఆదుకున్నం

ఆరేళ్లలో 4 వేల మంది టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్‌‌‌‌ అందించి ఆదుకున్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. పార్టీ కార్యకర్తల కోసం మరో ఏడాది ప్రమాద బీమా కల్పించేందుకు మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో యునైటెడ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీ ప్రతినిధులకు రూ.26.11 కోట్ల ఇన్సూరెన్స్‌‌‌‌ ప్రీమియం చెక్కును ఆయన అందజేసి మాట్లాడారు. 

మునుగోడు.. ప్రీఫైనల్ కాదు.. యూనిట్ టెస్టే

‘‘రూ.18 వేల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌‌ రెడ్డి బీజేపీలో చేరారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌‌ జడ్జితో విచారణకు సిద్ధపడాలి. ఈ కాంట్రాక్టులో ఎలాంటి మతలబు లేదని యాదాద్రిలో ప్రమాణం చేయాలి. భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి దగ్గర రాజగోపాల్‌‌రెడ్డితో బండి సంజయ్‌‌ ప్రమాణం చేయించాలి” అని కేటీఆర్ సవాల్ విసిరారు. రాజగోపాల్‌‌ రెడ్డికి దమ్ముంటే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును స్వచ్ఛందంగా వదులుకోవాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక 2023కు ప్రీఫైనల్‌‌ కాదని, కేవలం యూనిట్‌‌ టెస్ట్‌‌ మాత్రమేనని అన్నారు. రాజగోపాల్‌‌ రెడ్డి అక్రమాలపై టీఆర్‌‌ఎస్వీ నాయకులు మునుగోడులో తిరిగి ప్రచారం చేయాలన్నారు. ఒక కాంట్రాక్టర్‌‌ బలుపుతోనే ఈ ఉప ఎన్నిక వచ్చిందని, మునుగోడులో టీఆర్‌‌ఎస్సే గెలుస్తుందన్నారు. మునుగోడు ప్రజలను అంగట్లో సరుకుగా కొనొచ్చనే మోడీ అహంకారంతో ఈ ఉప ఎన్నిక తెచ్చారన్నారు. ఒకరికి కాంట్రాక్టు ఇస్తే మునుగోడు బాగు పడ్డట్టు కాదని, కేంద్రం మునుగోడు అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే ఉప ఎన్నిక పోటీ నుంచి తమ పార్టీ తప్పుకుంటుందన్నారు. మంత్రి జగదీశ్‌‌ రెడ్డి చేసిన సవాల్‌‌తో టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా తానూ ఏకీభవిస్తున్నానని అన్నారు. తమ పార్టీకి 105 మంది ఎమ్మెల్యేల బలముందని, ఒకటి రెండు సీట్లతో ఒరిగేదేమీ లేదన్నారు.