కులమతాల గొడవలకు ప్రాధాన్యత ఇస్తే వెనకబడతాం

కులమతాల గొడవలకు ప్రాధాన్యత ఇస్తే వెనకబడతాం

హైదరాబాద్ JNTUలో ఇన్నోవేషన్  ఇంజినీరింగ్ టెక్నాలజీ పై  అంతర్జాతీయ సదస్సు కొనసాగుతోంది.  దీన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  ‘‘రెండున్నరేళ్ల క్రితం ‘మేక్ ఇన్ ఇండియా’ అంశంపై ప్రధాని మోడీ ఒక మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంగా 3 ఐ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌, ఇన్నోవేషన్‌) గురించి ప్రధానికి వివరించాను. భారత్‌ను అభివృద్ధి పథంలో నడపాలంటే 3ఐ నినాదం పాటించాలని ప్రధానికి సూచించాను’’ అని పేర్కొన్నారు. 3 ఐ ఆధారంగానే రాష్ట్రంలో టీఎస్  ఐపాస్ పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా ఈజీ చేశామన్నారు. వేల కంపెనీలకు ఈ విధానంలో అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. 

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 

తెలంగాణ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ కాలంలోనే 24 గంటల పవర్ ఇచ్చే స్థాయికి వచ్చామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ లో రెప్పపాటు కూడా పవర్ కట్ లేదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి ఆమె రాష్ట్రపతి అభ్యర్థి అయ్యాక కరెంట్ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని నదులు,  నీటి వనరులతో 70 వేల టీఎంసీల నీరు దేశంలో ఉందని.. 40 నుంచి 50 టీఎంసీల నీరు అన్ని అవసరాలకు సరిపోతుందని తెలిపారు.  ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని,  JNTU విద్యార్థులంతా వెళ్లి ఆ ప్రాజెక్టును విజిట్ చేయాలని కేటీఆర్ కోరారు. 

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు

ప్రతి ఒక్కరికీ ఒక ప్రతిభ ఉంటుందని,  టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని మంత్రి కేటీఆర్ తెలిపారు.  మనం ఇంటికి వెళ్లి  చూస్తే అన్ని వేరే దేశాల నుంచి తయారు చేసిన వస్తువులే ఉంటాయని అన్నారు.   మనం మసీదును కూలగొట్టి గుడి కడదాం అంటూ గతాన్ని తోడే పనిలో బిజీగా ఉన్నామని,  చైనా లాంటి దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ పై ఫోకస్ పెట్టాయని తెలిపారు. కులమతాల గొడవలకు ప్రాధాన్యత ఇస్తే వెనకబడతామని వెల్లడించారు. స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తయారవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  ఉన్నత విద్యా మండలి  చైర్మన్  లింబాద్రి, JNTU  వీసి  కట్టా నర్సింహ రెడ్డి, సెయింట్ ఫౌండర్ BVR  మోహన్ రెడ్డి  పాల్గొన్నారు.