బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్  హైదరాబాద్ లోని  బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్‌ను ఇవాళ  ఉదయం ( సోమవారం, ఆగస్టు-10) ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ను 26.45 కోట్ల వ్య‌యంతో ప్రీ కాస్ట్‌ విధానంలో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తాయి. ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వైపు వెళ్లే మార్గంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. మొత్తం 14 పిల్లర్స్‌తో, 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల దూరం నిర్మించారు. సికింద్రాబాద్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీని నిర్మాణం కోసం ఎల్బీనగర్‌ నుంచి బైరామల్‌ గూడ దారిలో 11 భవనాలను తొలగించారు. హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.