బీఎస్పీ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోలేదా రేవంత్ : కేటీఆర్

బీఎస్పీ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోలేదా రేవంత్ : కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని భూపాలపల్లి జిల్లాలోనే నిర్మించామని, ఇక్కడి ప్రజలు గొప్పగా చెప్పుకునే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘మాది మూమ్మాటికి కుటుంబ పాలనే. అవును. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యులే. నేను రాను బిడ్డో సర్కారుకు దవాఖానకు అనే పరిస్థితుల నుంచి.. నేనుపోతా సర్కారు దవాఖానేకే అనే పరిస్థితులను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. బరాబర్ ఇది వసుధైక కుటుంబమే. మాకు కులం పిచ్చి లేదు. మతం పిచ్చి లేదు. ఒక పిచ్చోడు ప్రగతిభవన్ పేల్చేస్తాం అంటాడు. మరోకడు సచివాలయం పేల్చేస్తాం అంటున్నాడు. ఒకడితో మరోకడు పోటీ పడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి మనుషుల చేతుల్లో రాష్ట్రం పెడితే ఆగమైతది. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా..? తెలంగాణ రాకపోతే వీళ్లను ఎవరైనా గుర్తించేవారా..? వాళ్ల మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కచాన్స్  ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

మీకో న్యాయం..మాకో న్యాయామా..?

కాంగ్రెస్ కు 10 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారో ప్రజలకు చెప్పండని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ఎమ్మెల్యే గండ్ర బాజాప్తుగా కాంగ్రెస్ నుండి BRSలో చేరారని చెప్పారు. రాజస్తాన్ లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్  చేర్చుకోలేదా?... మీకో న్యాయం..మాకో న్యాయామా..? అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థపై బీజేపీ కన్ను పడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణినిని ప్రైవేటు పరంకానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం అయితే 4 కోట్ల ప్రజలకు లాభం ఉంటుందన్నారు. మధుసూదనాచారిని ఎమ్మెల్సీ గా చేసి సీఎం కేసీఆర్ గౌరవించారని అన్నారు. ఎవరి సమర్థతా ఏంటో సీఎం కేసీఆర్ కు తెలుసన్నారు. ప్రజల మనసులు గెలవాలంటే ఏం చేయాలో చెప్పాలి.. ఏం చేశామో కూడా చెప్పాలి అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు.