తుక్కుగూడ సభలో అమిత్ షా అన్ని అబద్దాలే చెప్పారు

తుక్కుగూడ సభలో అమిత్ షా అన్ని అబద్దాలే చెప్పారు

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తుక్కుగూడ సభలో అన్ని అబద్దాలే చెప్పారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు ఒక్కో టూరిస్ట్ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. గాలి మోటార్ లో వచ్చి, గాలి మాటలు చెబుతున్నారని అన్నారు. ఇక్క‌డి ప‌రిస్థితులు వారికి తెలియ‌వని, ఎయిర్‌పోర్టులోనూ, పార్టీ కార్యాల‌యాల్లోనూ చ‌క్క‌గా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయ‌కత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ను చ‌దువుతున్నారని, దాంట్లో స‌త్యం ఉందా..? అస‌త్యం ఉందా..? అనే విష‌యం తెలుసుకోకుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు. 

అమిత్ షా మాట్లాడిన మాట‌లు, చెప్పిన అబ‌ద్ధాలు చూస్తుంటే ఆయ‌న పేరును క‌చ్చితంగా మార్చుకోవాలని అన్నారు. ఆయ‌న అమిత్ షా కాదు.. అబ‌ద్ధాల బాద్ షా అన్నారు మంత్రి కేటీఆర్. తుక్కుగూడ సభలో చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని, అన్ని అబద్దాలే మాట్లాడారని అన్నారు. అమిత్ షా చెప్పిన మాటలను నమ్మడానికి తెలంగాణ ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు. స్థానిక నాయకత్వం ఇచ్చే స్క్రిప్ట్ ను చదివి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతామంటే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వాట్సాప్ వ‌ర్సిటీలో తిరిగే విష‌యాల‌ను వాస్త‌వాలుగా భ్ర‌మింప చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ అమిత్ షాపై నిప్పులు చెరిగారు. 

అవినీతి ఎవరిది..? 

ఇంత అవినీతి ప్ర‌భుత్వాన్ని దేశంలోనే చూడ‌లేద‌ని అమిత్ షా (14న వ తేదీన) చేసిన కామెంట్స్ ను కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. ముఖ్య‌మంత్రి పీఠం కోసం కేంద్రం రూ. 2500 కోట్లు అడిగిన‌ట్లు క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ చెప్పారని, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయన్ను స‌స్పెండ్ చేయలేదన్నారు. పాటిల్ వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం ఖండించ‌లేదన్నారు. క‌ర్ణాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ల‌ను కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఈశ్వ‌ర‌ప్ప వేధింపులు త‌ట్టుకోలేక ఓ కాంట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో 40 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌క‌పోతే టూరిజం మంత్రి ఓ ప్రాజెక్టును ఆపేశారని చెప్పారు. ఎవ‌రిదీ అవినీతి ప్ర‌భుత్వ‌మ‌ని కేటీఆర్ నిల‌దీశారు.

ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో, ఏం ఇచ్చారో చెప్పాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తే ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. నిజం చెప్పమంటే నిజాం గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే నిజాం, రజాకార్ల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు కేంద్రానికి చెల్లించిందని, రాష్ట్రానికి కేవలం లక్షా 68 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. 

మరోవైపు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ ను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.