మునుగోడులో టీఆర్ఎస్ సభ.. మంత్రి మల్లారెడ్డి హడావుడి

మునుగోడులో టీఆర్ఎస్ సభ.. మంత్రి మల్లారెడ్డి హడావుడి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనదో ప్రత్యేక శైలి. టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని తీన్మార్ డ్యాన్స్ లు చేస్తుంటారు. మనుగోడులో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగసభకు మల్లారెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఓ ఏరియాకు వచ్చే సరికి మంత్రి మల్లారెడ్డి కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి డాన్సులు చేశారు. ‘చుట్టు చుట్టు చుట్టు చుక్కలు చూడు’ ఓ సాంగ్ కు డ్యాన్స్  చేశారు. కార్యకర్తలు కారు ముందు భాగాన నిలిచి.. స్టెప్పులు వేశారు. ఓ వైపు ట్రాఫిక్ తో తిప్పలు పడుతుంటే... మంత్రి మల్లారెడ్డి డ్యాన్సులు చేయడంపై పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకిరువైపులా కార్లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఇక సీఎం కేసీఆర్ మునుగోడు టూర్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్-వరంగల్ హైవేపై కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలను చిట్యాల మీదుగా మళ్లిస్తున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు కేసీఆర్ కటౌట్లు పెట్టించారు. చౌటుప్పల్ మండలం నుంచి నారాయణపురం వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సభలోనే సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.