కేసీఆర్ చుట్టూ మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

కేసీఆర్ చుట్టూ మంత్రి మల్లారెడ్డి చక్కర్లు
  • బెదిరింపుల ఆడియోపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం
  • అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎం

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నా అపాయింట్మెంట్  దొరకడం లేదు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ సిద్దిపేట పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్కు వెళ్లారు. బుధవారం ప్రగతిభవన్ కు చేరుకున్నారు. మంత్రి ఈ రెండు రోజులపాటు ఫామ్హౌస్, ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించిన ఆడియో లీక్ కావడం రాజకీయంగా సంచలనం రేపింది. ‘‘సర్పంచ్ కిస్తే సరిపోతదా..ఈడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నడు..పొట్టుపొట్టు చేసి ఇడ్సిపెడ్తం’’ అని మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. అయితే.. తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్  తనది కాదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై  సీఎంను కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 
వివాదాలు కొత్తేమీ కాదు
మంత్రి మల్లారెడ్డికి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. మున్సిపల్ ఎన్నికల టైంలో ఆయన టికెట్లు అమ్ముకున్నట్టు బాధితులు నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు పక్కనే ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఓ మహిళ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మంత్రిపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో మంత్రి అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని కమిషనర్ మంగమ్మ అడ్డుకోబోగా మంత్రి సీరియస్ గా ఆమెకు వార్నింగ్  ఇచ్చినట్లు, దీంతో ఆమె తన డిప్యూటేషన్ ను రద్దు చేసుకుని సెక్రటేరియట్ విధుల్లో జాయిన్ అయినట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంపై మల్లారెడ్డి తన సన్నిహితుల వద్ద చేసే కామెంట్స్ కూడా ప్రగతిభవన్ వర్గాలకు చేరినట్టు తెలిసింది. ‘‘నాకు పోస్టు ఊరికే రాలే..ముట్టజెప్తేనే  వచ్చింది’’ అని  ఆయన తరుచూ  మాట్లాడుతున్నట్టు నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మల్లారెడ్డికి కొత్తేమీ కాదని, అయితే ఈసారి మాత్రం పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండే రియల్టర్ ను  బెదిరించడం వివాదాస్పదమైందని టీఆర్ఎస్  సీనియర్  నేత ఒకరు అభిప్రాయపడ్డారు.  
మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలె: బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తుల భూములపై మల్లారెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మల్లారెడ్డిపై ఫిర్యాదులు వస్తున్నా సీఎం ఎందుకు స్పందించడంలేదని ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎర్ర సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దూలపల్లి నుంచి శామీర్పేట వరకు ప్రతి వెంచర్పై మల్లారెడ్డి వాటా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.