ఎలక్షన్ కోడ్ లెక్క చేయని మంత్రి మల్లారెడ్డి.. 800 మంది సెంట్రింగ్ కార్మికులతో మీటింగ్

ఎలక్షన్ కోడ్ లెక్క చేయని మంత్రి మల్లారెడ్డి.. 800 మంది సెంట్రింగ్ కార్మికులతో  మీటింగ్

మేడిపల్లి, వెలుగు :  మంత్రి మల్లారెడ్డి ఎలక్షన్​ కోడ్​ను బ్రేక్ చేశారు. శనివారం  బోడుప్పల్ కార్పొరేషన్​పరిధిలోని బొమ్మకు బాలయ్య ఫంక్షన్ హాల్​లో ఎలాంటి పర్మిషన్ లేకుండా జరిగిన 800 మందిసెంట్రింగ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దీని గురించి సమాచారం అందుకున్న  ఎన్నికల అధికారి వినూత్నరెడ్డి అక్కడికి వెళ్లేసరికి  మంత్రి మల్లారెడ్డి, నిర్వాహకులు  అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

దీంతో అక్కడ ఏం జరిగిందని వివరాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తానని, ఫొటోలు, వీడియోలు తీసుకొని ఈఆర్వో రాజేష్ కుమార్​కు నివేదిక సమర్పిస్తానని వినూత్నరెడ్డి చెప్పారు.  కానీ, దీనిపై మేడ్చల్ ఎన్నికల ఈఆర్వో, కీసర ఆర్డీవో రాజేశ్​కుమార్​ను వివరణ కోరగా ‘ అవునా.. నేను తెలుసుకుంటాను’ అని సమాధానం  ఇచ్చారు. అధికార పార్టీకి మేడ్చల్ జిల్లా అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

 అయితే, సెంట్రింగ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా..  కొందరు   జై కాంగ్రెస్ నినాదాలు చేసినట్లు సమాచారం. కార్మికులు చనిపోతే ఆ శాఖ మంత్రిగా మీరేం చేశారంటూ మరికొందరు  మల్లారెడ్డిని నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అక్కడి నుంచి  వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా మేడిపల్లి పోలీసులు అటు వైపు కూడా చూడకపోవడం పలు అనుమానాలకు  దారి తీస్తున్నది.