ఆగిపోయిన రోడ్డు పనులకు మంత్రి మల్లారెడ్డి భూమిపూజ

ఆగిపోయిన రోడ్డు పనులకు మంత్రి మల్లారెడ్డి భూమిపూజ
  • అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, అరెస్టు 
  • ఇప్పటికే ఇద్దరు కాంట్రాక్టర్లు మార్పు.. కొత్తగా మరొకరికి వర్క్స్​

జవహర్ నగర్/కంటోన్మెంట్, వెలుగు: కొన్నేండ్ల కింద శాంక్షన్ అయిన రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోగా, ఇప్పుడా పనులకు మళ్లీ రెండోసారి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లా బాలాజీనగర్ నుంచి జవహర్ నగర్ మెయిన్ రోడ్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర 100 ఫీట్ రోడ్డు వేసేందుకు రూ.8.20 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఈ పనులకు 2021 ఏప్రిల్ 11న మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కొన్ని రోజులకే పనులు నిలిచిపోయాయి. డివైడర్లు, లైట్లు మాత్రమే ఏర్పాటు చేయగా రోడ్డు పనులు మాత్రం మొదలుకాలేదు. ఇప్పటివరకు ఇద్దరు కాంట్రాక్టర్లు మారగా, ఇప్పుడు మరో కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. మంగళవారం శంకుస్థాపన అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..  కాంట్రాక్టర్లు పనులు సరిగా చేయక, ఎక్కడికక్కడ వదిలేశారన్నారు. దాంతో జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే రూ.4 కోట్ల అంచనాతో మళ్లీ పనులు ప్రారంభించామని వెల్లడించారు.  ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కోసం రోడ్డు వేయిస్తున్నామని, రానున్న రోజుల్లో 100 ఫీట్ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎప్పుడో కావాల్సిన రోడ్డు పనులను పూర్తి చేయకుండా, 100 ఫీట్ల రోడ్ ను 50 ఫీట్ల రోడ్ గా చేయడం ఏంటని ప్రశ్నించారు. వారిని జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కొట్టండి చప్పట్లు కార్మికులతో మంత్రి

గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు బండ్లు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి మంగళవారం భవన నిర్మాణ కార్మికులు వెళ్లగా.. వాళ్లతో చర్చలు జరిపిన మంత్రి హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పారు. కార్మి కులతో అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ‘‘మీకు నా మీద కోపం ఉంది కదూ.. నన్ను తిడదామని వచ్చారు. కానీ తిట్టలేదు. ఎందుకంటే నేను మీ కోసమే పని చేస్తున్న. నాకు వేరే పనిలేదు. నేను సీఎంతో మాట్లాడి వాహనాలు ఇప్పిస్తా. కార్మిక శాఖ అకౌంట్​లో రూ.1,800 కోట్లు ఉన్నాయి. అవి నా కోసమా? మీ కోసమే కదా” అని కార్మికులతో మంత్రి అన్నారు. అనంతరం కార్మికుల ముందే అధికారులతో  ఫోన్ లో మాట్లాడారు. కార్మికుల ఫైల్​ను పుటప్​ చేశామని అధికారు లు చెప్పగా.. ‘‘మీరు చెప్పిన డిమాండ్లు కూడా పెట్టాం కదా..  ఇప్పుడైనా నా కోసం చప్పట్లు కొట్టండి’’ అని కార్మికులతో అడిగి మరీ మల్లారెడ్డి చప్పట్లు కొట్టించుకున్నారు. తొలుత జిల్లాకు ఒక కార్మిక భవన్ నిర్మిస్తామని, ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.