సొంత పైసలతో రోడ్లు వేయాలని మేం జెప్పినమా?.. మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన గ్రామస్తులు

సొంత పైసలతో రోడ్లు వేయాలని  మేం జెప్పినమా?.. మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన గ్రామస్తులు

శామీర్ పేట, వెలుగు: సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డికి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నాని, రోడ్లు వేయిస్తున్నానని చెప్పారు. దీంతో అలియాబాద్ గ్రామస్తులు మంత్రిని నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయనే సొంత నిధులతో రోడ్లు, నాలాల పనులు చేయిస్తున్నారని, ఇంతకుముందు ప్రభుత్వ నిధులతో ఎందుకు నిర్మించలేదని మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. కొన్నేండ్లుగా  గ్రామంలో మురుగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, శామీర్‌‌‌‌‌‌‌‌పేట పెద్ద చెరువు సరిహద్దు సమస్య ఏండ్లుగా అలాగే ఉందని మండిపడ్డారు. 

వానలకు వాగులు పొంగి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డికి ఈ విషయం చెప్పండంటూ మంత్రి దురుసుగా సమాధానమిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అయినందున మిమ్మల్నే అడుగుతున్నామనంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎదురుతిరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  గ్రామ సమస్యలు పరిష్కరించాలని అడిగితే.. పార్టీల గురించి మాట్లాడి మంత్రి వెళ్లిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.