ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి

ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి
  • అన్నిరంగాలను అభివృద్ధి చేశాం .. ‘మీట్ ​ద ప్రెస్’ లో మంత్రి మల్లారెడ్డి 

ఖైరతాబాద్,వెలుగు: దేశాన్ని, రాష్ట్రాన్ని 56 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్​తో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒకప్పుడు ఐటీ పేరు చెబితే బెంగళూరు గుర్తుకు వచ్చేది. కేటీఆర్​ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీకి కేరాఫ్​అడ్రస్​హైదరాబాద్ అయింది. కాంగ్రెస్​ అంటే స్కాం, కరువు, కేసీఆర్​అంటే నీళ్లు.. ఆయన వచ్చాకే తాగు, సాగు నీరుకు ఇబ్బంది లేదు’’.. అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్​’లో మంత్రి పాల్గొని మాట్లాడారు. 

తెలంగాణ ఆవిర్భావం అనంతరం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని, ఇదంతా సీఎం కేసీఆర్​వల్లే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, బస్తీ దవాఖానాల ఏర్పాటు, ప్రయివేట్​విద్యాసంస్థలకు దీటుగా రూ.730 కోట్లతో అన్ని సదుపాయాలతో కాలేజీలు, పాఠశాలలను అభివృద్ధి చేసిందని చెప్పారు. రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నడు. అందుకే ఎమ్మెల్యే టిక్కెట్లను అమ్ముకుంటుండని, మేడ్చల్​ఎంపీగా గెలిచి  ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని మంత్రి విమర్శించారు. ప్రెస్ క్లబ్​అధ్యక్షుడు వేణుగోపాల్​నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రెస్​క్లబ్​కార్యవర్గం పాల్గొంది. అనంతరం కొందరు జర్నలిస్టులు మంత్రికి కొన్ని ప్రశ్నలు వేశారు. అవి..

ప్రశ్న : బోడుప్పల్​లోని ఓ వెంచర్​లో  కొనుగోలు చేసి స్థలాల్లో రిజిస్ట్రేషన్​చేసుకుని ఇళ్లు కట్టుకుంటే వక్ఫ్ భూములంటూ కేసులు వేశారు ?

మంత్రి : అవును నిజమే నా వద్దకు వచ్చింది. ఎప్పుడో పాత డాక్యుమెంటుతో కోర్టులో కేసు వేశారు. ఎన్నికల అనంతరం దానిపై దృష్టి పెడతా.

ప్రశ్న: మీ కాలేజీ సమీపంలో 40 ఎకరాల భూమిని కబ్జా చేసి మీ కొడుకు పేరుపై పెట్టారు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.?

మంత్రి : అవన్నీ ఎన్నికల ముందు గిట్టని వారు అంటారు. పాలమ్మి, పూలమ్మి నిజాయతీగా సంపాదించా. అందరి కంటే ఒక వేయి ఎక్కువిచ్చి కొన్నా. నాకు 800 ఎకరాల భూమి ఉంది. అందులో 5 00 ఎకరాల్లో కాలేజీలు కట్టాను. ఆధారాలు ఉంటే తీసుకురా..? అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. 

ప్రశ్న :  రైల్వే బ్రిడ్జిలు నిర్మాణం పూర్తి కాలేదు. 

మంత్రి :   కొంపల్లి, ఘట్​కేసర్, మేడ్చల్​లో అన్నీ అండర్​పాస్​లు తెచ్చా.. కావాలంటే నావెబ్​సైట్​ను చూడొచ్చు.