రెండోసారి ఐటీ విచారణకు హాజరైన భద్రారెడ్డి

రెండోసారి ఐటీ విచారణకు హాజరైన భద్రారెడ్డి

మంత్రి మల్లారెడ్డి సంస్థలు, కాలేజీలపై ఐటీ రైడ్స్ కేసులో ఆయన చిన్న కొడుకు భద్రారెడ్డి రెండోసారి ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాలేజీలో సీట్ల కేటాయింపులపై అధికారులు అడిగిన వివరాలను అందజేశారు. నవంబర్ 28న 12 మందిని ఐటీశాఖ అధికారులు విచారించారు. మంత్రి మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా 12 మంది ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు.

ఐటీ విచారణకు హాజరైన వారిలో MLRIT కాలేజీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి, మెడికల్ కాలేజీ అకౌంటెంట్, ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మల్లారెడ్డి ఎడ్యుకేషన్ గ్రూపునకు చెందిన ఇద్దరు అకౌంటెంట్స్ ఉన్నారు. 

ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించామని మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామన్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు తమ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన విషయంలో చాలామందికి నోటీసులు పంపించారని తెలిపారు. క్లర్కు స్థాయి నుండి అకౌంటెంట్ డైరెక్టర్ల వరకూ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.

డబ్బులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తననేమీ ఐటీశాఖ అధికారులు ప్రశ్నించలేదని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తాను MLRIT ఛైర్మన్ గా మాత్రమే ఉన్నానని, ఆర్థిక లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కాలేజీలో పిల్లల ఫిట్ నెస్, స్పోర్ట్స్ విషయాలు మాత్రమే చూసుకుంటానని, ఇదే విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పానన్నారు.  ఈ నెల 30వ తేదీన మరోసారి విచారణకు రావాలని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డికి ఐటీ అధికారులు చెప్పారు.   

గత నెల 22,23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, ఆఫీసులు, కాలేజీలతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు.