వడ్లు మొత్తం కొంటమని  కేంద్రం రాసియ్యాలి

వడ్లు మొత్తం కొంటమని  కేంద్రం రాసియ్యాలి

న్యూఢిల్లీ, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తే, అంత కొంటామని రాసివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వానాకాలంలో కేంద్రం ఇచ్చిన 60 లక్షల టన్నుల వడ్ల టార్గెట్ నేడో రేపో పూర్తవుతుందని చెప్పారు. మిగిలిన వడ్లపై క్లారిటీ ఇవ్వాలన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రులు జగదీశ్​ రెడ్డి, గంగుల కమలాకర్​, ప్రశాంత్ రెడ్డి, టీఆర్​ఎస్​ ఎంపీలతో కలిసి నిరంజన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వకంగా క్లారిటీ ఇవ్వాలని కోరేందుకే తాము ఢిల్లీకి వచ్చామని తెలిపారు. ‘‘వడ్లు కొన్న మూడు, నాలుగు రోజుల్లో రైతులకు రాష్ట్ర  ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్రం హామీ ఇవ్వలేమని చెబితే, మేమంతా (రాష్ట్ర ప్రభుత్వం) ఎక్కడికి పోవాలి. కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్​లు ఉన్నాయి.  ఒక్క హామీని కూడా అమలు పర్చడం లేదు. అందువల్ల నోటి మాటతో చెల్లుబాటు కాదు. రాసివ్వాలి” అని డిమాండ్​ చేశారు. రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదన్నారు. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​తో చర్చించేందుకు శనివారం నుంచి ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీల టీం వేచిచూస్తోందని తెలిపారు. తమ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు గోయల్​తో ఫోన్లో మాట్లాడారని, సమయం ఇవ్వాలని కోరారని ఆయన చెప్పారు. ‘‘కేంద్ర మంత్రి సమయం ఇవ్వాలి. మా గోడు వినాలి. ఐదు నిమిషాలు సమయం ఇస్తే పరిష్కారమయ్యే అంశానికి, బుద్ధిపుడితే టైం ఇస్తామన్నట్లు కేంద్ర మంత్రి ధోరణి కన్పిస్తున్నది. మమ్మల్ని నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమే” అని అన్నారు. ఢిల్లీకి వచ్చే ముందే కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ కోరామని, రెండు రోజులు ఆయన ముంబైలో ఉంటారని, సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్ ఉన్నందున ఢిల్లీ రాగానే బిజీ అవుతారని కేంద్రమంత్రి కార్యాలయం తెలిపిందన్నారు
 

కిషన్ రెడ్డి అయోమయంలో ఉన్నరు


ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అయోమయంలో ఉన్నారని నిరంజన్​రెడ్డి విమర్శించారు. వానాకాలం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం కోరితేనే మిల్లింగ్ చేసి రైస్ ఇస్తున్నామని, మిల్లింగ్, హమాలీ చార్జ్, సుతిల్ కు అయ్యే ఖర్చు కేంద్రమే ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్టాక్  రెడీగా ఉందని, కేంద్రమే లిఫ్ట్ చేయడం లేదన్నారు. ‘‘కేంద్రం కోరిన టార్గెట్ ప్రకారం వడ్లు సేకరించడం మా పని. మిల్లింగ్ అయిన రైస్ ను కేంద్రం తీసుకుపోవాలి. దాంతో మాకేం సంబంధం. మేము మోసుకొచ్చి ఢిల్లీల ఇస్తమా? అది రాష్ట్ర ప్రభుత్వం పనా?’ అని నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు.  

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు