రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు
  • రాష్ట్ర సర్కార్​ తెచ్చిన విదేశీ అప్పులు రూ.2,835 కోట్లు
  • లోక్‌‌సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • ఇప్పటిదాకా మొత్తం రుణాలు రూ.4 లక్షల కోట్ల పైనే!
  • రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్‌‌‌‌బీఎం చట్ట పరిధిలో తీసుకున్న అప్పులు రూ.2.37 లక్షల కోట్లు ఉన్నట్లు పార్లమెంట్‌‌లో కేంద్రం వెల్లడించింది. అందులో రూ.2,835 కోట్ల అప్పులను విదేశాలకు చెందిన సంస్థల నుంచి తీసుకున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌధరి సోమవారం సమాధానం ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం (జేఐసీఎ), ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌‌మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్‌‌మెంట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర సర్కార్ అప్పులు తీసుకున్నట్లు చెప్పారు. ‘‘గత ఐదేళ్లలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు ఇన్​స్టాల్​మెంట్స్ కింద రూ.382.21 కోట్లు రీపేమెంట్ చేసింది. ఇక వాటి వడ్డీలకు రూ.147.53 కోట్లను చెల్లించింది. 
అప్పులు 2,835 కోట్లు
మరో మూడేళ్లలో రీపేమెంట్, వడ్డీలకు ఇంకో రూ.530 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్, ఎక్స్‌‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఐదేళ్లలో తీసుకున్న అప్పులు రూ.2,160 కోట్లుగా ఉన్నాయి” అని వివరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికే తెలంగాణ మిగులు బడ్జెట్‌‌లో ఉంది. 2014లో రూ.69,517 కోట్ల అప్పులు ఉంటే ఏడేండ్లలో అవి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.లక్షన్నర కోట్ల అప్పులు ఎఫ్ఆర్‌‌‌‌బీఎం చట్టం పరిధిలో కాకుండా వివిధ కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా తీసుకున్నవి ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ తీసుకునే అప్పులతో ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. గతేడాది సవరించిన బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.70,080 కాగా.. ఈసారి మరో రూ.11,864 పెరిగింది. అంటే రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై 
రూ.81,944 అప్పు ఉంది.