
మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్
రాష్ట్రంలో యూరియా సమస్య అంతగా లేదని.. చిన్న చిన్న సమస్యలనే పెద్దగా చూపిస్తున్నారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వాతావరణ పరిస్థితుల కారణంగా యూరియా అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతోందని చెప్పారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష తర్వాత నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వరదల కారణంగా ఇతర రాష్ట్రాలనుంచి యూరియా లారీలు, లాజిస్టిక్ వాహనాలు రావడానికి ఆలస్యం అవుతోందని… విదేశాల నుంచి ఇండియాకు రావాల్సిన షిప్పుల రాక కూడా లేట్ అవుతోందని.. మంత్రి అన్నారు. తెలంగాణలో యూరియా కొరత అంతగా సమస్యలేదనీ.. పలు రాష్ట్రాల్లోనూ కొంత ఉందని.. ఏదైనా సమస్య ఉన్నట్టనిపిస్తే.. అది తెలంగాణది కాదని.. దేశ సమస్య అని అన్నారు నిరంజన్ రెడ్డి.
“కేంద్రాన్ని ఎనిమిదన్నర లక్షల టన్నుల యూరియా కావాలని అడిగినం. కేవలం 7 , 8 సెంటర్లలో మాత్రమే కొద్దిగా సమస్య ఉంది. రైతులు క్యూ లైన్లో ఉన్నారు. కంపెనీలు, డీలర్లు బఫర్ స్టాక్ మెయింటనెన్స్ చేయకపోవడం కూడా ఒక సమస్యే అయింది. సహకార సంఘాల ద్వారా 2లక్షల 35 వేల టన్నుల యూరియాను సరఫరా చేశాం. నాగార్జున యూరియా కంపనీలో ఒక సెంటర్ సాంకేతిక సమస్యతో క్లోజ్ చేశారు. దీని ఎఫెక్ట్ మన మీద పడింది. మనకు రావాల్సిన యూరియాను కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేయించింది. షిప్పుల రాకలో ఆలస్యం వల్ల యూరియా సరఫరా సమస్యలు వచ్చాయి. అంతే కానీ కేంద్ర రాష్ట్రాల తప్పులేదు. ఈ సెప్టెంబర్ లో 48 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే… 60 వేల మెట్రిక్ టన్నులను సిద్ధం చేశాం” అన్నారు.
“సమస్యను ఎక్కువ చేసి చూపించడంతోనే సమస్య వచ్చింది. రబీకి కూడా యూరియా వుంటుందో లేదో అనే అనుమానాలు వచ్చేలా ఎక్కువ చేసి చూపించారు. దుబ్బాకలో రైతు చనిపోవడం బాధాకరం. అంతకుముందే రైతుకు గుండెలో నొస్తుందని చెప్పి… యూరియా కొరకు వెళ్లాడు. లైన్ లో నిలబడి దురదృష్టవశాత్తూ చనిపోయాడు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా రాష్ట్రాలకు సరఫరా విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారు. రాత్రి నుండి షాప్ లలో ఎంత స్టాక్ ఉందో ఇవ్వాలని కోరాం. ఏమైనా తేడా ఉంటే చర్యలు ఉంటాయి. యూరియాను బ్లాక్ చెయ్యడం సాధ్యం కాదు. రైతు బంధు ప్రవేశపెట్టే ముందు ఉచిత ఎరువులు ఇస్తాం అని ఆలోచన ఉండే అని మాత్రమే సీఎం చెప్పారు. దానిలో భాగమే అప్పుడు మాత్రమే రైతు బంధు అని నామకరణం చేశారు ముఖ్యమంత్రి. లోకల్ బీజేపీ నేతల విమర్శలను పట్టించుకోం” అన్నారు నిరంజన్ రెడ్డి.