
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని వ్యవసాయరంగంతోపాటు దెబ్బతిన్న జీవ వైవిధ్యం మెరుగుపడుతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కరీంనగర్ వి-కన్వెన్షన్ సెంటర్ లో వానాకాలం పంటల సాగుపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సాగునీటి వసతులు పెరిగితే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టైన కాళేశ్వరంపై కొందరు అసత్యప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
8ఏళ్లలోనే తెలంగాణ ఇంత గొప్పగా ఎదగడాన్ని చూసి జీర్ణించుకోలేని కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. స్వచ్ఛగ్రామాలు, మంచి జీవన ప్రమాణాలున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర సంస్థలే చెప్పినట్లు మంత్రి తెలిపారు. అప్పుడు స్వరాష్ట్రం కోసం పోరాడితే.. ఇప్పుడు శత్రు వైఖరి ఉన్న వారితో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. బంగారు పంటలు పండే భూములు మన దేశంలో ఉన్నా..ఇంకా అనేక రకాల పంటల సాగులో, ఎగుమతిలో మన దేశం వెనకబడే ఉందని చెప్పారు. ఇప్పటికీ మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి 9రకాల కూరగాయలను దిగుమతి చేసుకుంటుందని..అటువంటి పంటలను మనమూ పండించాలని సూచించారు. పత్తి, మిర్చి పంటలకు ధరలు విపరీతంగా ఉన్నాయని..ఆ పంటలు వైపు రైతులు ఆలోచన చేయాలని చెప్పారు.
వానాకాలం పంటల విషయంలో ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టడం లేదు కానీ సూచనలు మాత్రం చేస్తోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెబితే రెచ్చగొట్టి పంటలు వేసేలా చేసిన బీజేపీ నేతలు ఆ తర్వాత చేతులెత్తేశారని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పంటల మార్పిడి ఆవశ్యకతను రైతులకు వివరించాలన్నారు. స్వల్పకాలిక పంటలైన అపరాల సాగుతో పాటు, దీర్ఘకాలిక పంట అయిన అయిల్ ఫామ్ పై రైతుల దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 2లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ను సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు నిరంజన్ రెడ్డి. లాభనష్టాలు, మార్కెట్ డిమాండ్ చూసుకుంటూ రైతులు పంటలు సాగు చేసుకోవాలన్నారు. కోతుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు కాబినెట్ సబ్ కమిటీ వేస్తామన్నారు. కమిటీ సిఫార్సుల మేరకు త్వరలోనే కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెట్టడంతో పాటు..వాటిని వాటి స్థావరాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వార్తల కోసం
హత్యకు రేవంత్ కుట్ర చేశారనడం సరికాదు
నిఖత్ జరీన్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సన్మానం