కేటీఆర్.. నువ్వో బచ్చాగాడివి.. దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు: మంత్రి పొంగులేటి

కేటీఆర్.. నువ్వో బచ్చాగాడివి.. దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్, వెలుగు: ‘కేటీఆర్..​ నీకు దమ్ముంటే జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో గెలిచి చూపించు. మూడున్నరేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా ఎందుకు? అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో, విదేశాలకు చెక్కేస్తవో..’ అని కేటీఆర్​పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మండిపడ్డారు. 

గురువారం (సెప్టెంబర్ 18) ఖమ్మం జిల్లా ఏదులాపురంలో వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు కాంగ్రెస్‌‌లో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..​ ముందు తన ఇంటిని, పార్టీని కేటీఆర్ చక్కబెట్టుకోవాలన్నారు. ‘మీ నాయనే పాలేరులో మూడు సార్లు ముక్కు నేలకురాసినా ఏమీ సాధించలేకపోయాడు.. నువ్వెంత, బచ్చాగాడిని’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ ఫ్యామిలీ అహంకారానికి ఇప్పటికే ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారని, మూడో సారీ సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ భంగపాటు తప్పదన్నారు. ‘పాలేరులో నువ్వు నిలబడు.. నీపై ఓ కార్యకర్తను పెట్టి కాంగ్రెస్​ను గెలిపిస్తా.. కాచుకో’ అని సవాల్​ విసిరారు. బీఆర్​ఎస్​ హయాంలో ఏడాదికి లక్ష ఇండ్లు కట్టిఉంటే.. పదేండ్లలో పది లక్షల పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరేదన్నారు. కానీ అలా చేయకుండా బీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టిందని, అది కొట్టుకుపోయిందని విమర్శించారు. పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుందని, కేసీఆర్​ ఫ్యామిలీ ఒళ్లంతా విషం నింపుకొని ఉందని ఫైర్​ అయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కాంగ్రెస్​ లీడర్లు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.