ఖమ్మం జిల్లాలో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం జిల్లాలో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి ఖమ్మం- కోదాడ రోడ్డు వరకు వయా రాముడు చెరువు మార్గంలో రూ.4.2 కోట్లతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి స్థలం అప్పగింత పట్టా ధ్రువీకరణ పత్రాలను వారు అందజేశారు. 

కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నర్సింహులగూడెం నుంచి గోపతండా వరకు రూ.7.15 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించిన అనేక సందర్భాల్లో రహదారి అధ్వాన్నంగా ఉండి గిరిజన బిడ్డలు పడిన కష్టాలను కళ్లారా చూశానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని మంత్రి పొగులేటి అన్నారు. మంత్రి హోదాలో ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని, తండాల కష్టాలు శాశ్వతంగా తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్​ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ పంచాయతీ రాజ్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.