అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ఇల్లెందు, వెలుగు : రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్‌‌‌‌ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్‌‌‌‌ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 లక్షల రేషన్‌‌‌‌ కార్డులు మంజూరు చేయడమే కాకుండా.. 18 లక్షల కార్డుల్లో పేర్లు ఎక్కించామని గుర్తు చేశారు. 

ప్రభుత్వ పనితనానికి జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నికే నిదర్శనమని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నాలుగు దశల్లో మొత్తం రూ.ఐదు లక్షలను ప్రతి సోమవారం వారి అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా గత ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక పేదలకు సన్న బియ్యం పంపిణీతో పాటు 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఐటీడీఏ పీవో రాహుల్‌‌‌‌, ఎస్పీ రోహిత్‌‌‌‌రాజు, ఆర్డీవో మధు, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌ బానోత్‌‌‌‌ రాంబాబు, మున్సిపల్‌‌‌‌ మాజీ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, అనసూయ పాల్గొన్నారు.