అభివృద్ధిలో వెనక్కి తగ్గం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అభివృద్ధిలో వెనక్కి తగ్గం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ -ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలో  పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మంగలితండాలో  అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంగలితండాలో రూ.3 కోట్ల 31 లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు చేశామన్నారు.

 ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వెనక్కి తగ్గడం లేదని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే  గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ.12 వేలకు పెంపు,  సన్న బియ్యం సరఫరా, రూ.11 లక్షల నూతన రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డులలో 17 లక్షల కొత్త పేర్లు నమోదు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. 

రాబోయే 3 ఏండ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని చెప్పారు. అనంతరం ఈశ్వర మాదారంలో రూ.10 లక్షలతో, తళ్లగడ్డ తండా  రూ.10 లక్షలతో, పెరిక సింగారం రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు, భగత్ వీడు రూ.10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. పెరికసింగారంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, ఈఈ పవార్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో రామచంద్ర రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత స్థాయికి ఎదగాలి

కల్లూరు :  ప్రతి విద్యార్థి లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి పొంగులేటి సూచించారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి మండలంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. కల్లూరు పట్టణంలో  75 లక్షలతో నిర్మించిన షాదీఖానా ను ప్రారంభించారు. 

 సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో రూ.75 లక్షల తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్రంథాలయం, రీడింగ్ రూమ్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ  ఆధ్వర్యంలో  200 మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాలను  పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో తాను ఇంటర్మీడియట్ చదివానని గుర్తు చేశారు. గతంతో పోలిస్తే నేడు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 

విద్యా శాఖలో పెను మార్పులు తీసుకుని వస్తున్నామన్నారు. జూనియర్ కళాశాలకు హాస్టల్  మంజూరు, డిజిటల్ తరగతులకు మెటీరియల్, ఎంసెట్ కోచింగ్ సంబంధించిన మెటీరియల్​ను 15 రోజుల్లో అందిస్తామన్నారు.  కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలక మైలురాయిగా నిలుస్తుందని,బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ‘అన్న అంటే..  నేను ఉన్నా’ అంటూ అనునిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనన్నకృషి చేస్తున్నారని తెలిపారు. 

అనంతరం కల్లూరు మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ జి. వెంకట్ రెడ్డి, డీఈ రాంబాబు, కల్లూరు ఏసీపీ అని శెట్టి రఘు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ దేవి, మున్సిపల్​ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ పులి సాంబశివుడు, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ మాదాభత్తుల రూప,ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.