ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లెందు, టేకులపల్లి, వెలుగు:  ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఇల్లెందు పట్టణం, టేకులపల్లి మండలాల్లో సోమవారం  ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. టేకులపల్లీ మండలంలోని తావుర్య తండా నుంచి పాత తడికలపూడి వరకు చెప్టా, కల్వర్టు, బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.3.53 కోట్లు,  రాళ్లవాగు పై రూ. 2.50 కోట్లతో హై లెవెల్ వంతెన, పెట్రాంచెలక వాగు పై రూ. 2 కోట్ల వ్యయంతో హై లెవెల్ వంతన నిర్మాణానికి, కిష్టారం ముర్రేడు వాగు పై రూ. 3 కోట్ల వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఇల్లెందు మండలంలోని రూ.6 కోట్లతో మంజూరైన మేడికుంట- రాంచంద్రపురం బ్రిడ్జి నిర్మాణానికి, రూ.3.06 కోట్లతో లలితాపురం రోడ్డు, పట్టణంలోని రూ. 1.56 కోట్లతో జేకే కాలనీ మినీ స్టేడియం ప్రహరీ గోడ, లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..  గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేస్తున్నామన్నారు.  అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, డీఎస్పీ ఎన్. చంద్రభాను, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.