గజం భూమి కూడా కబ్జా కావద్దు : పొంగులేటి 

గజం భూమి కూడా కబ్జా కావద్దు :  పొంగులేటి 
  • ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి: పొంగులేటి 
  • మంత్రిని కలిసిన రెవెన్యూ అధికారులు

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో ప్రజలే కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి రావాల్సిందేనని, గజం భూమి కూడా కబ్జా కాకుండా చూడాలన్నారు.

శనివారం మంత్రి పొంగులేటిని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, వీఆర్వో అసోసియేషన్, వీఆర్ఏ హక్కుల సాధన సమితి, రీడిప్లాయ్డ్ వీఆర్వో అసోసియేషన్, రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ల ప్రతినిధులు కలిశారు. రెవెన్యూ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లను కల్పించాలని కోరారు. ఈహెచ్ఎస్ అమలు, రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు, అద్దె వాహనాల బిల్లులు, కారుణ్య నియామకాలు తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. ఈ నెల 29న 900 మంది తహసీల్దార్లతో, అక్టోబర్ 6న డిప్యూటీ కలెక్టర్లతో, 250 మంది అదనపు కలెక్టర్లతో సమావేశమవుతామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేస్తున్నదని, కొంచెం ఓపికగా ఉండాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సూచించారు.

వీఆర్​ఏ వ్యవస్థపై కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ల ఎన్నికల బదిలీలను వెంటనే చేపట్టాలని మంత్రిని కోరినట్టు ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి తెలిపారు.